తెలంగాణ టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ పరీక్ష ఫలితాలను ఇవాళ విడుదల చేశారు.
హైదరాబాద్: తెలంగాణ టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలు బుధవారంనాడు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ టెన్త్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్ష ఫలితాలను https://results.bse.telangana.gov.in, https://results.bsetelangana.org లింక్‌లపై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.ఈ ఏడాది ఏప్రిల్ 3 నుండి 13వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించారు. టెన్త్ క్లాస్ లో మొత్తం 86.60 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత సాధించినవారిలో బాలికలు 88.53 శాతం కాగా, బాలురు కేవలం 84.68 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
ఈ దఫా 2,793 స్కూళ్లలో వంద శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 25 స్కూళ్లలో జీరో శాతంఫలితాలు వచ్చాయని మంత్రి చెప్పారు. నిర్మల్ జిల్లాలో 99 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచారు. వికారాబాద్ జిల్లా 59.46 శాతం పలితాలతో చివరి స్థానంలో నిలిచింది.
also read:రేపే తెలంగాణ టెన్త్ పరీక్ష ఫలితాలు: రిజల్ట్స్ కోసం ఇలా చేయండి..
రాష్ట్ర వ్యాప్తంగా 4.91 లక్షల మంది విద్యార్దులు టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తే 4 లక్షల 19 వేల మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. 7,492 మంది విద్యార్ధులు టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రైవేట్ గా రాసినట్టుగా మంత్రి గుర్తు చేశారు. జూన్ 14 నుండి 22 వరకు టెన్త్ క్లాస్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 26 చివరి తేదీగా నిర్ణయించామన్నారు మంత్రి .
ఈ ఏడాది టెన్త్ క్లాస్ పరీక్షల సమయంలో పేపర్ల లీక్ అంశం విద్యార్ధులను గందరగోళ పర్చింది. తెలుగు ప్రశ్నాపత్రం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లీకైందని ప్రచారం సాగింది. మరో వైపు హిందీ ప్రశ్నాపత్రం కమలాపూర్ లో లీకైందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. హిందీ పేపర్ లీక్ విషయమై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే