మంత్రి మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డిని సూరారంలోని ఆసుపత్రికి తరలించారు. తనయుడిని పరామర్శించేందుకు మంత్రి మల్లారెడ్డి వెళ్లారు. మల్లారెడ్డి అనుచరులు మల్లారెడ్డి ఇంటి వద్ద ఐటీ దాడులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.
హైదరాబాద్: అస్వస్థతకు గురైన మంత్రి మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డిని సూరారంలోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి ఐటీ అధికారులు చేరుకున్నారు. మహేందర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ఆసుపత్రి వద్ద భారీగా పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశారు.
తన కొడుకును ఐటీ అధికారులు ఇబ్బంది పెట్టి ఉంటారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తన కొడుకు ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకొని ఆయన హుటాహుటిన తన నివాసం నుండి సూరారంలోని నారాయణ హృదయాలయానికి చేరుకున్నారు. తన కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి , ఆయన భార్య, మల్లారెడ్డి బంధువు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఐటీ దాడులతో తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మల్లారెడ్డి విమర్శించారు.
నిన్న ఉదయం నుండి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో నిన్న ఐటీ అధికారులు రూ. 2 కోట్లు సీజ్ చేశారు. 50 ఐటీ బృందాలు మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, బంధువులు, కటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్నటి నుండి సోదాలు సాగుతున్నాయి., ఇవాళ రాత్రి వరకు సోదాలు సాగే అవకాశం ఉంది.
also read:నా కుమారుడిని ఐటీ అదికారులు కొట్టి ఉంటారు, అందుకే ఛాతినొప్పి.. మల్లారెడ్డి సీరియస్..
ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో తన అనుచరులు, టీఆర్ఎస్ శ్రేణులను మంత్రి మల్లారెడ్డి నిలువరించే ప్రయత్నం చేశారు. తన కొడుకును పరామర్శించేందుకు వెళ్లే సమయంలో ఐటీ అధికారులు వ్యవహరించిన తీరును మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న తెల్లవారుజాము నుండే ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తాను , తన బంధువులు, కుటుంబసభ్యులు ఐటీ సోదాలకు సహకరిస్తున్నా కూడా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది తన కొడుకును కొట్టడంతోనే అస్వస్థతకు గురయ్యారన్నారు. బీజేపీ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఐటీ దాడులు చేస్తుందన్నారు. తాను దొంగ వ్యాపారాలు చేయడం లేదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు మంత్రి మల్లారెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు తెలంగాణలో మరో సారి కలకలం రేపాయి. అంతకు ముందు మరో మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో కూడా ఈడీ, ఐటీ సోదాలు జరిగాయి.