ప్రగతి భవన్ ను పేల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా చెప్పాలని ఆయన అడిగారు.
హైదరాబాద్: ప్రగతి భవన్ ను పేల్చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనొచ్చా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయవచ్చా అని ఆయన అడిగారు. కాంగ్రెస్ పార్టీ విధానం ఇదేనా అని ఆయన అడిగారు. రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వహించేవాళ్లు ప్రగతి భవన్ లో ఉంటారని కేటీఆర్ చెప్పారు. ఇది తీసేయాలి, అది రద్దు చేయాలని అనడం తప్పా రేవంత్ రెడ్డికి మంచి మాటలు రావా అని కేటీఆర్ అడిగారు.ధరణిని రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నాడన్నారు. కానీ ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ధరణికి అనుకూలంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పారు.
రేవంత్ రెడ్డితో దోస్తానాతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి , శ్రీధర్ బాబులు కూడా చెడిపోయారన్నారు. ఆర్టీఐ పేరుతో పీసీసీ చీఫ్ దందా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో కోట్లలో వసూలు చేశారన్నారు. రిటైర్డ్ ఆఫీసర్లతో రేవంత్ తతంగం నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. దందాలు చేసే రేవంత్ లాంటి వాళ్లకు ధరణి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బలం చేకూరేలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క కూడా మాట్లాడడాన్ని కేటీఆర్ తప్పు బట్టారు.
ఇదిలా ఉంటే కేటీఆర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేయడమే తమ పార్టీ విధానమని మాజీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ విషయంలో తమ మద్య ఎలాంటి బేధాలు లేవన్నారు. కానీ, కేటీఆర్ మాత్రం తమ మధ్య విబేధాలున్నాయని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
also read:రేవంత్ ఒక బ్రోకర్..ఆయనను జనం ఐటెం లెక్క చూస్తారు : ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు
ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చేసిన నష్టం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రగతిభవన్ తో ఎవరికీ ప్రయోజనం ఉందని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ వల్ల ఎవరికి ఉపయోగమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.