శాసనసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్.. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా లేదన్న భట్టి..

By Sumanth KanukulaFirst Published Feb 9, 2023, 12:40 PM IST
Highlights

తెలంగాణ శాసనసభలో ఈరోజు విద్యుత్ సమస్యపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించారు

తెలంగాణ శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. శాసనసభలో ఈరోజు విద్యుత్ సమస్యపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. శాసనసభ లోపల ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం సభలో నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్కలు అసెంబ్లీ పరిసరాల్లో ప్లకార్డులతో నిరసన తెలియజేశారు.  కరెంట్ కోతలతో రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులకు 24 గంటలు త్రీ ఫేజ్ కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా లేదని విమర్శించారు. అందుకే నిరసన తెలిపి బయటకు వచ్చామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని అన్నారు. రైతులకు 4 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని.. కరెంట్  ఏ సమయంలో ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.  రైతాంగ సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చామని.. కానీ స్పీకర్ చర్చకు అనుమతించలేదని తెలిపారు. రైతు సమస్యలపై గొంతు పోయేలా అరిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులకు అంతరాయం లేకుండా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతుల పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరెంట్ చార్జీల రూపంలో ప్రజలపై రూ. 16 వేల కోట్ల భారం మోపాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. సీతక్క మాట్లాడుతూ.. క్రాప్ సీజన్‌లో మాటిమాటికీ కరెంట్ తీసేస్తున్నారని విమర్శించారు. నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతులను కాపాడాలని సీతక్క కోరారు. 

click me!