
ఉక్రెయిన్‌పై (ukraine) రష్యాతో యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థుల తరలింపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ (operation ganga) పేరిట ప్రత్యేక మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. గడిచిన కొద్దిరోజులుగా నిర్విరామంగా సాగుతున్న ఈ ఆపరేషన్‌లో చాలావరకు భారతీయులందరినీ స్వదేశానికి తరలించింది కేంద్రం. ఇంకా కొంతమంది ఉన్నట్లుగా వార్తలు వస్తున్నా.. వారిని కూడా దేశానికి తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
అంతా బాగానే ఉన్నా..విద్యార్థుల తరలింపును కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఓ ప్రచారాస్త్రంగా వాడుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి . తాజాగా ఇదే అంశంపై టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (ktr) సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తరలింపులో బీజేపీ సర్కారు పీఆర్ ఎక్సర్‌సైజ్ మాదిరిగా వ్యవహరించిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు మోడీ దయ వల్లే ప్రాణాలు రక్షించబడ్డాయని ఉక్రెయిన్ నుంచి తరలించిన విద్యార్థులకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెబుతున్న వీడియోను కేటీఆర్ షేర్ చేశారు.
మరోవైపు.. ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ఆపరేషన్ గంగాను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ప్రత్యేక విమానాల్లో భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నది. భారతీయ పౌరుల రక్షణను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం.. అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను సైతం రంగంలోకి దించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు విమానాలు దేశరాజధాని న్యూఢిల్లీ చేరుకున్నాయి. 420 మందితో హంగరీలోని బుడాపెస్ట్, రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 aircrafts) ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగాయి. స్వదేశానికి తిరిగివచ్చిన విద్యార్థులకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు.
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ గంగాను ముమ్మరంగా కొనసాగిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటివరకు 6400 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ministry of external affairs) వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల్లో 7400 మంది భారతీయులు స్వదేశానికి తీసుకురానున్నామని తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ను వీడారని అధికారులు పేర్కొన్నారు. ఇంకా భారీ సంఖ్యలో భారతీయులు ఉక్రెయిన్ లోని ఉండిపోయారనీ, వారి రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారతీయుల తరలింపునకు 30 విమాన సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్న అధికారులు.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి వారిని తరలిస్తున్నామని వెల్లడించారు. రానున్న 24 గంటల్లో 18 విమానాలు భారత్‌కు చేరుతాయని తెలిపారు.