
నష్టాల్లో వున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కొన్ని సంస్థలను విక్రయిస్తోంది. ఇప్పటికే ఎయిరిండియాను విక్రయించేయగా.. త్వరలో ఎల్ఐసీ ఐపీవోకి (lic ipo) వెళ్లనుంది. తాజాగా పవన్ హాన్స్‌ను (pawan hans) విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) స్పందించారు.
లాభాల బాటలో సాగుతున్న పవన్ హాన్స్‌ను ప్రైవేట్ కంపెనీకి విక్రయించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. 2017లో రూ.3,700 కోట్ల నికర విలువ కలిగిన పవన్ హాన్స్‌లోని తన వాటాను కేవలం రూ.211 కోట్లకు విక్రయించిన తీరును కూడా కేటీఆర్ నిలదీశారు. ఇక పవన్ హాన్స్‌ను కొనుగోలు చేసిన కంపెనీ ఆరు నెలల క్రితం కేవలం కూ.1 లక్ష కేపిటల్‌తో ప్రారంభమైందని, ఈ కారణంగా ఈ డీల్‌పై ప్రశ్నలతో పాటు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ ప్రశ్నలకు కేంద్రం వద్ద ఏమైనా సమాధానాలు ఉన్నాయా? అని కూడా కేటీఆర్ ప్రశ్నించారు. ఇకపోతే.. పవన్ హాన్స్‌లో భారత ప్రభుత్వం, ఓఎన్జీసీకి (ongc) కలిపి 51:49 నిష్పత్తిలో భాగస్వామ్యాన్ని కలిగివున్నాయి. ఓఎన్జీసీ కూడా తన 49 శాతం వాటాను 202.86 కోట్లకు విక్రయిస్తోంది.