
రాష్ట్ర విభజనపై (ap bifurcation) పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌రావు (harish rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కారని, అమరుల త్యాగాలను కించపరచారని హరీశ్ దుయ్యబట్టారు. మోదీ వ్యాఖ్యలను గమనిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోందని మంత్రి ఆరోపించారు. రాష్ట్ర సాధన కోసం వేల మంది ప్రాణాలు అర్పించారని, ఆ అమరుల త్యాగాలను మోడీ అవమానిస్తున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
తెలంగాణపై విషం చిమ్మడమే మోదీ పనిగా పెట్టుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయని, తెలంగాణ ఏర్పాటుపై మోడీ చేసిన వ్యాఖ్యలను ఇక్కడి బీజేపీ నేతలు ఎలా సమర్థించుకుంటారని హరీశ్ రావు నిలదీశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ పురోగతి సాధిస్తుందని జోస్యం చెప్పారు. దేశంలో ఎంపీలు దత్తత తీసుకున్న టాప్-10 గ్రామాలలో బెస్ట్ ఏడు గ్రామాల అవార్డులు తెలంగాణకే వచ్చాయని, తమ ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనమని హరీశ్ రావు గుర్తుచేశారు. వలస కార్మికుల వల్లే కరోనా వచ్చిందని మోడీ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కుంభమేళా నిర్వహించినప్పుడు, ట్రంప్ సభలు, రోడ్ షోలు నిర్వహించినప్పుడు కరోనా పెరగలేదా? అని హరీష్‌రావు చురకలంటించారు.
కాగా.. రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన అందరి అభిప్రాయాల మేరకు జరగలేదంటూ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన విధానాన్ని తప్పు పట్టారనీ, అటు పార్లమెంటును, ఇటు సభాపతిని అవమానపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన నోటీసులో అభ్యంతరం వ్యక్తం చేశారు. 187వ నిబంధన కింద రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు పార్టీ ఎంపీలు కె.కేశవరావు (కేకే), సంతోష్‌కుమార్, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్ కలిసి నోటీసు అందజేశారు. మరోవైపు రాజ్యసభను ఈరోజు బహిష్కరిస్తున్నట్లు గా టీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు కూడా టీఆర్ఎస్ వాదనతో ఏకీభవించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా టీఆర్ఎస్ కు మద్దతు పలికారు.
ప్రధాని మోడీ మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం .. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును శాస్త్రీయంగా ఆమోదించలేదనీ, తొందరపడి రూల్స్ కు వ్యతిరేకంగా ఆమోదించిందని తప్పుబట్టారు. ఎటువంటి చర్చ లేకుండా.. ఫిబ్రవరి 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కానీ, లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మైకులు కట్ చేశారని, తలుపులు మూసివేశారని, కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రేలు ప్రయోగించారని ప్రధాని అన్నారు. ఈ బిల్లు నేపథ్యంలో ముందస్తు చర్చ లేకుండానే ఆమోదించడం జరిగిందనీ, విభజన ప్రక్రియపై వాటాదారులతో ఎటువంటి సంప్రదింపులేవ్వనీ, దీంతో ఇరు రాష్ట్రాలు మధ్య ఇంకా ఆందోళనలు కొనసాగున్నాయని ఆయన అన్నారు.