తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉస్మానియా ఆసుపత్రి విషయమై ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలపై మంత్రి హరీష్ రావు స్పందించారు.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడడం సరైంది కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా బుధవారంనాడు స్పందించారు. ఉస్మానియా ఆసుపత్రిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె కోరారు.
ఈ విషయమై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. బుధవారంనాడు హైద్రాబాద్ లోని మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా గవర్నర్ వ్యాఖ్యలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని ఆయన గవర్నర్ ను కోరారు.కానీ ప్రభుత్వంపై బురద చల్లొద్దని గవర్నర్ ను హరీష్ రావు సూచించారు. గవర్నర్ కు మంచి కనబడదు, చెడును బూతద్దంలో చూస్తారని మంత్రి హరీష్ రావు చెప్పారు.
వైద్యరంగంలో అభివృద్ధి గవర్నర్ కు కన్పించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు.గవర్నర్ లో రాజకీయాలు కన్పిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. చెడు చూస్తాం, చెడు వింటాం, చెడు మాట్లాడుతామంటే ఎలా అని హరీష్ రావు అడిగారు.
also read:ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఆందోళనకరం.. గవర్నర్ తమిళిసై
2015లోనే ఉస్మానియా ఆసుపత్రిని కేసీఆర్ సందర్శించిన విషయాన్ని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని కట్టాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. అయితే కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నట్టుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.