తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఇవాళ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీఆర్ఎస్ పై చేసిన విమర్శలకు ఆయన కౌంటరిచ్చారు.
సిద్దిపేట: బీజేపీకి పోటీ చేసేందుకు నాయకులే లేరని ఆయన ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇలాంటి నేతలు కూడా అసెంబ్లీకి పోటీ చేయమని తప్పించుకు తిరుగుతున్నారన్నారు.
సోమవారంనాడు జమ్మికుంటలో నిర్వహించిన బీజేపీ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఈ విమర్శలకు మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు. ఇవాళ సిద్దిపేటలో హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణపై ప్రధానమంత్రి మోడీ అక్కసు వెళ్లగక్కారని ఆయన విమర్శించారు.
undefined
తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఆపి తెలంగాణ అభివృద్ధిని బీజేపీ ఆపిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే తమ పథకాలు కాపీ కొట్టి ఎందుకు అమలు చేశారని ఆయన కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. తెలంగాణ పేరు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒక అవార్డు కూడా ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగకుంటే ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నారు.
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ సంక్షేమాన్ని, అభివృద్ధిని పొగిడిన ప్రధానమంత్రి గల్లీలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు చెప్పారు.తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు చేస్తామనే అనివార్య పరిస్థితి నెలకొందన్నారు.
సీట్లు కావాలంటే ఢిల్లీకే పోవాలి.... పదవులు కావాలంటే ఢిల్లీకి పోవాలి... ఆఖరికి ఓట్లు కావాలంటే కూడా ఢిల్లీ నుంచి నాయకులు రావాల్సిన పరిస్థితి బీజేపీ, కాంగ్రెస్‌లదని మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నవ్వుల పాలౌతరన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రోజుకో ఒక స్కాంతో కుదేలవుతుందని ఆయన విమర్శించారు.
also read:అధికారం లేకుండా కేసీఆర్ ఉండలేరు: జమ్మికుంట సభలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఒకసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతుందన్నారు. కానీ 11 సార్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. 9 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారని ఆయన చెప్పారు. మూడోసారి మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని మంత్రి హరీష్ రావు ధీమాను వ్యక్తం చేశారు. రేపు సిద్దిపేటలో జరిగే ప్రజా ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయన్నారు. నమ్మకానికి మారుపేరు కెసిఆరైతే, నయవంచనకు కాంగ్రెస్ మారుపేరని ఆయన విమర్శించారు.టికెట్లు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిజరూపం బయటపడుతుందన్నారు.