365వ రోజుకు చేరిన తెలంగాణా వేములఘాట్ రైతుల దీక్ష

First Published Jun 4, 2017, 8:59 AM IST
Highlights

కోటి ఎకరాలకు నీళ్ళు అంటూ  కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి ఒక విషయం గుర్తుంచుకోవాలె. రెండున్నర లక్షల క్వింటాళ్ల మిర్చి పంట వస్తే కొనే యంత్రాంగం మీ దగ్గిర లేదు, సమకూర్చే మనసు మీకు లేదు, పైసలూ లేవు. కోటి ఎకరాల పంటను ఏం చేసుకుంటవ్?  ఈ కోటి ఎకరాల ప్రాజక్టు లు  మాకెందుకని  మల్లన్న సాగర్ రైతులు దీక్ష చేయవట్టి ఏడాదయింది.  అలుపెరగని పోరాటం ఆ రైతులది, ముఖ్యంగా మహిళలది...

 

50 శతకోటి ఘనపుటడుగుల దుఃఖం ఈ వేములఘాట్ గ్రామ ప్రజలది. నేటికి ఈ తెలంగాణ పల్లె బిడ్డల నిరసన దీక్షకు  365 రోజులు.

 

పోరాడి సాధించుకునరాష్రంలో బతికేందకు మళ్లీ పోరాటమే చేయాల్సిన దుర్గతి వేములఘాట్ ప్రజలది.

 

కేసీఆర్ ప్రభుత్వం భూదాహానికి మేమెందుకు బలి కావాలె అంటున్న మల్లన్న సాగర్ ప్రాంత గ్రామం వేములఘాట్. పోయినేడాది జూన్ 5న తిరగబడ్డ ఆ గ్రామం ఎన్ని వత్తిడులకు లోనైందో. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పర్యవేక్షణలో, హరీష్ రావు నేతృత్వంలో గ్రామస్తులను లొంగదీసుకునేందుకు జరగని ప్రయత్నం లేదు. అయినా వారు తలవంచలేదు. 

ఈ మల్లన్న సాగర్ ప్రతిపాదిత ప్రాంతం మూడు నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది- గజ్వేల్, సిద్ధిపేట, దుబ్బాక.  ఇక్కడి 'ప్రజా' ప్రతినిధులెవరో కాదు,  ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్, రామలింగారెడ్డి.  ఎవరూ కూడా ఆ గ్రామ ఛాయలకు పోయే ధైర్యం నేడు చేయడం లేదు అంటే, ఆ ప్రజలది యెంత చైతన్యం?!

కుందేళ్ళు వేటకుక్కలను తరిమినట్లు మనం చరిత్రలో చదువుకున్నం. అది ఇపుడు మన కళ్ళెదుట వాస్తవం. అందుకో దండాలు వేములఘాట్ గ్రామమా!  నీ స్ఫూర్తి నా ఇంటిపేరును మార్చడమే కాదు... ఈ రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నది. 

 

కోటి ఎకరాలకు నీళ్ళు అంటూ  కబుర్లు చెప్పే ఓ ముఖ్యమంత్రి ఒక గుర్తంచుకోవాలి... రెండున్నర లక్షల క్వింటాళ్ల మిర్చి పంట వస్తే కొనే యంత్రాంగం లేదు, మనసు లేదు, పైసలు లేవు. కోటి ఎకరాల పంటను ఏం చేసుకుంటావు?  ధర అడిగితే సంకెళ్ళు వేస్తావు. బతుకు అడిగితే ఆత్మహత్యల వరదానాలు ఇస్తావు. యువకులపై కేసులు పెడతావు. యెన్ కౌంటర్లు చేస్తామని బెదిరింపజేస్తావు. ఏమైంది నీ ప్రతాపం మొన్న ఉస్మానియాలో? నేడు వేములఘాట్ లో? 

 

నీ సొంత జిల్లాలో అతి ఎక్కువ ఆత్మహత్యలు జరిగితే, 300 కోట్ల భవంతిలో కులికే నువ్వు ప్రజల మనిషివా? దేశంలోనే ఎక్కువగా 2885 రైతులు ఉసురు తీసిన నీది బంగారి తెలంగాణనా? 

 

రా... ఈ రోజు వేములఘాట్ కు. నువ్వో ప్రజలో తేలిపోతుంది.

 

పోలీసు పహారాలో, వందిమాగధుల భజనలో, ఆంధ్రా వ్యాపారుల తులాభారాలలో తూగే నీ మత్తు వదలగొట్టేది ఈ గ్రామమే. ఆ పునరంకిత ఘట్టం నేడే. తెలంగాణ బిడ్డలారా అందరూ తరలి రండి.

 

(*రచయిత ’ప్రజాతెలంగాణా‘ హైదరాబాద్. కోకన్వీనర్, ఫోన్ : 9030997371)

 

click me!