Hyderabad: అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.
Telangana stands as role model for development: తెలంగాణ ప్రజల ఐక్యత వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందిందనీ, దేశంలో అతి పిన్న వయస్కుడైన తెలంగాణను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. అభ్యుదయ వ్యతిరేక శక్తులు అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో ప్రగతి చక్రాలు ఆగడం లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. 17 సెప్టెంబర్ 1948న అప్పటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన రోజు 'జాతీయ సమైక్యతా దినోత్సవం'లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో భాగమైన సందర్భాన్ని 'జాతీయ సమైక్యతా దినోత్సవం'గా జరుపుకోవడం సముచితమని తెలంగాణ ప్రభుత్వం భావించిందన్నారు. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దార్శనికత, తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ పదును, చాకచక్యం, ఎందరో నాయకుల కృషి వల్ల దేశం ఐక్యమైందని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ శరవేగంగా సాధిస్తున్న ప్రగతి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందని కుటుంబం మరొకటి లేదన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచిందనీ, తమ ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు.
దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమ్రం భీమ్, రావి నారాయణరెడ్డి, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాప్ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, జమలాపురం కేశవరావు, బండి యాదగిరి, సుద్దాల హనుమంతు, కాళోజీ నారాయణరావు, దాశరథి వంటి ఎందరో నాయకుల కృషిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ భవితవ్యాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ప్రస్తుత తెలంగాణ అభివృద్దిలో తిరుగులేని ప్రయాణం సాగిస్తున్నదని అన్నారు. తెలంగాణలో పేదరికం తగ్గుముఖం పట్టి తలసరి ఆదాయం పెరిగిందనీ, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందని కుటుంబమే లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన విజయాలు, తలసరి విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయం, 100 శాతం ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమన్నారు.