అవసరమైతే కేంద్రంపై పోరాటం చేస్తాం: అసెంబ్లీలో కేసీఆర్

By narsimha lodeFirst Published Oct 7, 2021, 3:24 PM IST
Highlights


పల్లె, పట్టణ ప్రగతిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.

హైదరాబాద్: వక్ప్ బోర్డు భూముల అన్యాక్రాంతంపై సీబీసీఐడీ విచారణ చేయిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.తెలంగాణ అసెంబ్లీలో  గురువారం నాడు పల్లె, పట్టణ ప్రగతిపై జరిగిన చర్చలో cm kcr సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వక్ప్ బోర్డు భూముల అన్యాక్రాంతంపై విచారణకు ఆదేశిస్తామన్నారు.ఇవాళే సీబీసీఐడీ విచారణకు ఆదేశించనున్నట్టుగా Telangana Assembly లో ఆయన ప్రకటించారు.దేవాదాయ, వక్ఫ్ భూములను ఫ్రీజ్ చేసి ఉంచామని సీఎం చెప్పారు.

also read:కేంద్రంలో టీఆర్ఎస్‌కి అవకాశం రావొచ్చు: తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలనం

హైద్రాబాద్ నగరంలో కొత్తగా నాలుగు ఆసుపత్రులను నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. టిమ్స్ ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆక్సిజన్ సహా అన్ని సౌకర్యాలతో 68 వేల పడకలతో ఈ ఆసుపత్రులను నిర్మిస్తామని సీఎం ప్రకటించారు.  గడ్డి అన్నారం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. గడ్డి అన్నారం మార్కెట్ ను బాటసింగారం గ్రామానికి తరలిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

స్థానిక సంస్థలకు ప్రతి నెల నిధులు ఇవ్వడాన్ని విపక్షాలు స్వాగతిస్తాయనుకొంటే ఎప్పటిలాగే విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.పట్టణాల ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసునన్నారు. 

85 శాతం మొక్కలు బతకకపోతే ఉద్యోగాలు పోతాయి

హరితహరం పథకం కింద నాటిన మొక్కలు 85 శాతం బతకకపోతే అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ పదవులను కోల్పోతారని సీఎం చెప్పారు. అధికారులు  ఉద్యోగాలను కోల్పోతారని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. వీరంతా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోకుండా చట్ట సవరణ చేసిన విషయాన్ని సీఎం ఈ సందర్బంగా గుర్తు చేశారు. లోకల్ బాడీలకు కలెక్టర్ అనే వ్యవస్థ దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని కేసీఆర్ వివరించారు. 

కాంగ్రెస్ హయంలో ఏం చేశారు?

కాంగ్రెస్ హయంలో గ్రామాల్లో అభివృద్ది ఎలా ఉందో అందరికీ తెలుసునని సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. జరిగిన అభివృద్దిని  భట్టి విక్రమార్క ప్రశంసిస్తారని తాను భావించా... కానీ ఏం జరగలేదని విమర్శలు చేయడంపై కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో పంచాయితీల పరిస్థితిని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలా అభివృద్ది చెందాయో చూడాలని ఆయన విపక్షాలను కోరారు. కాంగ్రెస్ హయంలో ఏమీ చేయకుండానే ఇప్పుడు అభివృద్ది చేసే తమను విమర్శిస్తే బాగుండదని కేసీఆర్  చెప్పారు.

గతంలో పంచాయితీలకు తలసరి రూ. 4 ఇస్తే తామ ప్రభుత్వం రూ.669 ఇస్తోందని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ కార్మికులకు రూ. 8500 జీతమిస్తే తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 17,500 వేతనాలు ఇస్తున్నామన్నారు. సఫాయన్నా మీకు సలామన్నా అని  వేతనాలు పెంచి వారిని గౌరవించామని కేసీఆర్  తెలిపారు.సఫాయి కార్మికులు మన తల్లిదండ్రులకంటే ఎక్కువ సేవ చేస్తున్నారని ఆయన వారిని ప్రశంసలతో ముంచెత్తారు. గ్రామ పంచాయితీ కార్మికులకు గతంలో రూ.500 నుండి రూ. 4 వేలు ఇచ్చేవారన్నారు.తమ ప్రభుత్వం రూ.8500 జీతాలిస్తున్నామన్నారు.

జడ్పీ ఛైర్మెన్ల గౌరవ వేతనం రూ. 7,500 నుండి లక్షకు పెంచామన్నారు. జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ. 13 వేలకు ఎంపీటీసీ, సర్పంచ్ ల వేతనాలను రూ. 6500 లకు పెంచామని కేసీఆర్ వివరించారు.పల్లె ప్రగతితో గ్రామాలు అద్బుతంగా తయారయ్యాయన్నారు.

ఏడేళ్లలో తమ ప్రభుత్వం రూ. 36 వేల కోట్లను మంచినీటి కోసం ఖర్చు చేసిందని సీఎం చెప్పారు.   18,606 కి.మీ గ్రామీణ రోడ్లను రూ.8,536 కోట్లతో ఖర్చు చేసినట్టుగా సీఎం వివరించారు. గ్రామాల్లో పాడు బడిన బోరు బావులను పూడ్చి వేశామన్నారు. ఈ కారణంగా బోరు బావిలో పడిన చిన్నారి అనే వార్తలు లేకుండా పోయాయన్నారు.

అవసరమైతే కేంద్రంపై పోరాటం చేస్తాం

కాంగ్రెస్ అనుసరించిన విధానాలనే బీజేపీ అనుసరిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రాల పరిధిలోని వాటిని కేంద్రం లాక్కొంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకం పేర్లను కేంద్రంలోని బీజేపీ పేర్లు మారుస్తోందన్నారు.  ఏర్పాటైన అతి స్వల్ప కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అద్బుతమైన ప్రగతిని సాధించిందని ఆర్బీఐ నివేదికలో తెలిపిందని సీఎం చెప్పారు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల నుండి తీసుకొన్న ఆదాయంలో  తిరిగి రాష్ట్రాలకు కేంద్రం నుండి రావడం లేదని ఆయన చెప్పారు.

పెట్రోల్, డీజీల్ పై వచ్చే ఆదాయాన్ని కూడ  తీసుకొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.ఈ ప్రతిపాదనను బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడ తీవ్రంగా వ్యతిరేకించాయని సీఎం కేసీఆర్ తెలిపారు.యూపీకి చెందిన ఆర్ధిక శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.నిన్ననే తమిళనాడు సీఎం స్టాలిన్ తనకు లేఖ రాశాడని కేసీఆర్ గుర్తు చేశారు.  కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ విషయమై పోరాటం చేయాలని ఆయన లేఖలో కోరారన్నారు. అవసరమైతే కేంద్రంపై పోరాటానికి సిద్దమని ఆయన చెప్పారు.

 రైతు సంక్షేమం కోసం చర్యలు

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకొంటుందని చెప్పారు కేసీఆర్. రైతుబంధు, రైతు భీమాతో పాటు అనేక పథకాలను తీసుకొచ్చిన విషయాన్ని సీఎం తెలిపారు.రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని సీఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో ఎరువులు విక్రయించారని కేసీఆర్ విమర్శించారు. ప్రస్తుతం నీళ్లు, కరెంట్ ,పెట్టుబడి బాధ లేదన్నారు. 

 


 

click me!