
ములుగు జిల్లాలోని ఆదివాసీల సుదీర్ఘ పోరాటం ఫలించింది. తెలంగాణ హైకోర్టు వారికి అనుకూలంగా సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని తెలిపింది. ఆ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యుల్ కిందకే వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్త జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేడు తీర్పును వెలువరించారు. దీంతో 75 ఏళ్ల పాటు ఆదివాసీలు చేసిన పోరాటం ఫలించింది.
ఇక, ఇందుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆదివాసీల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వారు ఐదు షెడ్యూల్ పరిధిలోకి రారని ఆదివాసీయేతరులు వాదనలు వినిపించారు. అయితే ఇందుకు సంబంధించి గతంలో సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఆదివాసీయేతరుల అప్పీల్‌ను కొట్టివేసింది.