అసంతృప్తిలో బండి సంజయ్?.. కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు విముఖత!!

Published : Jul 05, 2023, 10:40 AM IST
అసంతృప్తిలో బండి సంజయ్?.. కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు విముఖత!!

సారాంశం

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించడంపై బండి సంజయ్ సంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించడంపై బండి సంజయ్ సంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన బీజేపీ అధిష్టానం.. బండి సంజయ్‌కు సముచిత స్థానం కల్పించనున్నట్టుగా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుందనే ఊహాగానాల దృష్ట్యా బండి సంజయ్‌ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయాలని బీజేపీ అధిష్టనం చూస్తోంది. లేకపోతే పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై బండి సంజయ్ విముఖత కనబరిచినట్టుగా తెలుస్తోంది. తాను సాధారణ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని బీజేపీ అధిష్టానానికి  సంజయ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన బండి సంజయ్.. ఆ తర్వాత మీడియా కంటపడకుండా అక్కడి  నుంచి వెళ్లిపోయారు. ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తనను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తొలగించడంపై బండి సంజయ్ ఆవేదనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా తన పనితీరును బీజేపీ పెద్దలు పలు సందర్భాల్లో ప్రశంసించారని.. మరి అలాంటప్పుడు తనను పదవి నుంచి తప్పించాల్సిన అవసరం ఏముందనే భావనలో బండి సంజయ్ ఉన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ అప్పగించే వేరే బాధ్యతలను స్వీకరించేందుకు బండి సంజయ్ నిరాకరిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. 

అయితే ఈరోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీ అనంతరం.. కేంద్ర కేబినెట్  పునర్వ్యవస్థీకరణ‌పై స్పష్టత వస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగిన పక్షంలో.. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినవారితో పాటు  కొందరికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడంతో పాటుగా.. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ  ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలువురికి అవకాశం కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. 

ఒకవేళ బండి సంజయ్‌కు కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు నిరాకరిస్తే.. మరి రాష్ట్రం నుంచి ఎవరికి చోటు కల్పిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహాయిస్తే.. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన కె లక్ష్మణ్ బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. దీంతో వీరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేకపోలేదు. వీరిలో కె లక్ష్మణ్ ఇప్పటికే పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యునిగా ఉన్నారు. మరోవైపు మంగళవారం ఎంపీ సోయం బాపురాలు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంకు వెళ్లారు. దీంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలోనే ఆయనను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిపించినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. మరోవైపు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే.. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తారనే ప్రచారం కూడా సాగుతుంది. ఇదిలా ఉంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన కిషన్ రెడ్డి.. మంగళవారం హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ ఎలాంటి స్పందనను వెల్లడించకపోవడం గమనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?