కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదు.. హైకోర్టు సంచలన తీర్పు..

Google News Follow Us

సారాంశం

తెలంగాణ హైకోర్టు సంచలన  తీర్పు వెలువరించింది.  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

తెలంగాణ హైకోర్టు సంచలన  తీర్పు వెలువరించింది.  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయంలో తప్పుడు ఆఫిడవిట్ సమర్పించారనే అభియోగాలపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో ఆఫిడవిట్‌‌లో వనమా  తప్పుడు సమాచారం  ఇచ్చారని తేల్చిన హైకోర్టు.. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. ఆయనకు రూ. 5 లక్షల జారిమానా కూడా విధించింది. 

అంతేకాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగేందుకు హైకోర్టు అవకాశం కల్పించింది. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. 

ఇక,  2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ  చేసిన వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి పోటీ  చేసిన జలగం వెంకట్రావు రెండో స్థానంలో నిలిచారు. వనమాకు దాదాపు 81 వేల  ఓట్లు రాగా, జలగంకు దాదాపు 77 వేల ఓట్లు  వచ్చాయి. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో వనమా గులాబీ గూటికి చేరారు. ఇదిలాఉంటే, వనమా వెంకటేశ్వరావు ఎన్నికను సవాలు చేస్తూ జలగం వెంకట్రావు 2019లో కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఆఫిడవిట్‌లో వనమా తప్పుడు సమాచారం ఇచ్చారని జలగం వెంకట్రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వనమా ఎన్నిక చెల్లదని అన్నారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది.