తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భద్రత విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అదనపు భద్రతను కల్పించాలని తెలంగాణ హైకోర్టు సోమవాంనాడు ఆదేశించింది. భద్రత విషయమై రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు విచారణ నిర్వహించింది.
పాదయాత్రకు అదనపు భద్రతను కల్పించాలని రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఈ నెల 3వ తేదీన తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఇవాళ్టికి ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇవాళ విచారణలో ఇరు వర్గాల వాదనలను హైకోర్టు విన్నది. రేవంత్ రెడ్డికి అదనపు భద్రతను కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రేవంత్ రెడ్డి భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అన్ని జిల్లాల ఎస్సీలను ఆదేశించినట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలకు పంపిన ఫాక్స్ మేసేజ్ ను ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే భద్రతను కేటాయిస్తున్నారా లేదో చెప్పాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదిని ఈ నెల 3న ఆదేశించింది హైకోర్టు. ప్రస్తుతం కేటాయించిన భద్రత కేవలం ట్రాఫిక్ నియంత్రణకే సరిపోతుందని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.రేవంత్ రెడ్డి కోసం 69 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో రేవంత్ రెడ్డికి అదనంగా భద్రతను కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది.
2023 ఫిబ్రవరి 6వ తేదీన మేడారం నుండి రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. తొలి విడతలో రేవంత్ రెడ్డి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. 60 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగనుంది. తొలి విడత పాదయాత్ర ముగిసిన తర్వాత రెండో విడత పాదయాత్రకు కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారు.
also read:పాదయాత్రలో రేవంత్ రెడ్డి భద్రతపై పిటిషన్: విచారణ ఈ నెల 6కు వాయిదా
గత వారంలో భూపాలపల్లిలో పాదయాత్ర సాగుతన్న సమయంలో కొందరు కోడిగుడ్లతో రేవంత్ రెడ్డిపై దాడికి యత్నించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి మనుషులనే తనపై దాడికి యత్నించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.