అగ్రిగోల్డ్ కుంభకోణం: తెలంగాణ హైకోర్టులో విచారణ

Siva Kodati |  
Published : Jun 11, 2021, 02:31 PM IST
అగ్రిగోల్డ్ కుంభకోణం: తెలంగాణ హైకోర్టులో విచారణ

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళ్ రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిగింది

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళ్ రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన ప్రతిపాదనకు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ బెంచ్ తీవ్రంగా స్పందించింది. అగ్రిగోల్డ్ కంపెనీ ప్రతిపాదనకు అంగీకరిస్తే మరో ఇరవై ఏళ్లు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన సవరించిన ప్రతిపాదనలపై సమాధానం ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నందున ఆ రాష్ట్ర హైకోర్టుకు ఏపీ విభజన చట్టం ప్రకారం బదిలీ చేసే విషయాన్ని న్యాయస్థానం పరిశీలిస్తోంది. బినామీ ద్వారా మిడ్జిల్‌లో అగ్రిగోల్డ్ యాజమాన్యం భూములు కొన్నది.

దీనికి సంబంధించి తెలంగాణ సీఐడీ ఎస్పీ అఫిడవిట్ దాఖలు చేశారు. మిడ్జిల్‌లో 15.18 కోట్లు పెట్టి 150 ఎకరాలు ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. సదరు వ్యక్తి అగ్రిగోల్డ్ కంపెనీ బినామీ అని తెలంగాణ సీఐడీ సందేహం వ్యక్తం చేస్తోంది. అలాగే అగ్రిగోల్డ్ కంపెనీ డైరెక్టర్ అవ్వా సీతారామారావుకు చెందిన శివశక్తి టింబర్ ఎస్టేట్‌తో బిడ్‌లో పాల్గొన్న వ్యక్తికి సంబంధాలు ఉన్నాయి.

Also Read:ఈడీ షాక్: రూ. 4,109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు

కానిస్టేబుల్‌గా పనిచేసిన వ్యక్తి 15.18 కోట్లు పెట్టి 150 ఎకరాలు కొనే సామర్థ్యం లేదని ఆదాయపు పన్ను శాఖ ద్వారా సేకరించిన వివరాలను తెలంగాణ సీఐడీ హైకోర్టుకు సమర్పించింది. రెండు రాష్ట్రాలు అగ్రిగోల్డ్ సమస్యపై చర్చించి కలిసి పరిష్కారం కనుక్కునేందుకు ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టును సమయం కోరారు. విజయవాడలో ఎస్‌బీఐ నిర్వహించిన వేలంలో అగ్రిగోల్డ్‌కు చెందిన షాపింగ్ మాల్‌ను సింగిల్ బిడ్డర్‌కు కేటాయించడంపై సీఐడీ పరిశీలన జరిపేందుకు సమయం కావాలని ఎపీ అడ్వకేట్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు . దీనిపై స్పందించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu