గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్‌పీఎస్‌సీకి చుక్కెదురు: పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్

By narsimha lode  |  First Published Sep 27, 2023, 2:00 PM IST

గ్రూప్-1 రద్దుపై  టీఎస్‌పీఎస్‌సీ దాఖలు చేసిన  రిట్ అప్పీల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. 



హైదరాబాద్: గ్రూప్-1 రద్దుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారంనాడు సమర్ధించింది. గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చి చెప్పింది.  టీఎస్‌పీఎస్‌సీ అప్పీలును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది.  

ఈ ఏడాది జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్‌పీఎస్ సీ నిర్వహించింది. అయితే పరీక్ష నిర్వహణ సమయంలో బయోమెట్రిక్ తీసుకోలేదని కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో  విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ పరీక్షలను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ లో  టీఎస్‌పీఎస్ సీ   రెండు రోజుల క్రితం సవాల్ చేసింది.  ఈ విషయమై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు  సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్ధించింది. 

Latest Videos

undefined

నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అభ్యర్ధుల నుండి బయో మెట్రిక్ ను తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్ష నిర్వహణలో టీఎస్‌పీఎస్‌సీ నిబంధనలను పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది.గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణలో టీఎస్‌పీఎస్‌సీ విఫలమైందని హైకోర్టు పేర్కొంది. వ్యవస్థపై నమ్మకం కోల్పోవడంతో గతంలో పరీక్ష రాసిన 50 వేల మంది మరోసారి పరీక్ష రాయలేకపోయారని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.  రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని 503 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి  అర్హుల ఎంపిక కోసం టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించింది ప్రభుత్వం. 

గ్రూప్-1 పరీక్షలకు 3.80 లక్షల మంది ధరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పరీక్షలకు మాత్రం 2, 32, 457 మంది  హాజరయ్యారు. రెండు సార్లు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడంతో అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.2022 అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసింది. ఈ ఏడాది జూన్ 11న మరోసారి పరీక్ష నిర్వహించింది. గత ఏడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందనే అనుమానంతో ఈ పరీక్షను రద్దు చేశారు. ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన పరీక్షలో బయోమెట్రిక్  తీసుకోకపోవడం ఇతరత్రా కారణాలతో  హైకోర్టు  రద్దు చేసింది. 

ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో ఇప్పటికే  టీఎస్‌పీఎస్‌సీపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా  నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష కూడ హైకోర్టు తీర్పుతో రద్దు కావడంతో అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

click me!