రేపు ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనం.. ఉదయమే శోభాయాత్ర ప్రారంభం.. నిమజ్జనం ఎన్ని గంటలకంటే..

By Sumanth Kanukula  |  First Published Sep 27, 2023, 1:57 PM IST

ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రకు ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం 7 గంటల ప్రాంతంలో మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది.


హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. రేపు నగరంలో గణేష్ ఉత్సవాల శోభాయాత్ర, నిమజ్జనం జరగనుంది. దీంతో నగరంలో భారీ సందడి నెలకొననుంది. అయితే  ముఖ్యంగా చాలా మంది భక్తులు.. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రను వీక్షించేందుకు తరలివస్తుంటారు. మరి ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర, నిమజ్జనంకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రకు ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది.

ఈ రోజు అర్థరాత్రి చివరి పూజ అనంతరం ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు. అర్దరాత్రి 1 గంట తర్వాత మహాగణపతిని కదిలించనున్నారు. అర్దరాత్రి 2 గంటల తర్వాత విగ్రహాలను భారీ టస్కర్ లోకి ఎక్కించి.. వెల్డింగ్‌ వర్క్ చేపట్టనున్నారు. ఉదయం 7 గంటల సమయంలో మహా గణపతి శోభాయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మహా గణపతి శోభాయాత్ర.. ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకోనుంది. ఉదయం 10 గంటల సమయంలో  క్రేన్ నెంబర్ 4 వద్దకు మహా గణపతి శోభాయాత్ర చేరుకునేలా ఉత్సవ సమితి ప్లాన్ చేసింది. ఆ తర్వాత భారీ వాహనంపై నుంచి మహా గణపతి తొలగింపు కార్యక్రమం చేపడతారు. అనంతరం క్రేన్ వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. 

Latest Videos

మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి చేయనున్నారు. ఇందుకోసం ఉత్సవ సమితితో పాటు హైదరాబాద్ నగర పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఇక, గురువారం జరగనున్న గణేష్ విగ్రహాల నిమజ్జనానికి.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో కమిషనరేట్‌ల పోలీసులు దాదాపు 24,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

click me!