
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ చర్యలు తీసుకుంటున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంక్షేమ పాలనకు నూతన దిక్సూచి వేస్తున్నామని పేర్కొంది. ఇటీవల పూర్తి అయిన రైతు భరోసా కార్యక్రమంలో 9 రోజుల వ్యవధిలో రూ.9,000 కోట్లను రాష్ట్ర రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా తన ప్రభుత్వ ప్రామాణికతను ప్రదర్శించిదని సీఎం రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమ ముగింపు సందర్భంగా సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ‘రైతు నేస్తం’ సభలో రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది. అప్పు రూ.8 లక్షల కోట్లకు పైగా చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదే లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారు. చివరకు అందులోని పలు నిర్మాణాలు కూలిపోయాయి. కాళేశ్వరం నిర్మాణం సమయంలోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు ఫామ్ హౌస్‌లు ఎలా వచ్చాయి? రాష్ట్రం దివాలా అయితే వీళ్లు కోటీశ్వరులవ్వడమెలా?" అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇది ఇప్పుడు అధికారపక్షం విసిరిన అతిపెద్ద రాజకీయ సవాల్‌గా మారింది.
"వ్యవసాయాన్ని దండగ అని చూశారు, కానీ మేము రైతులను రాజులుగా చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లుతున్నాం" అని రేవంత్ అన్నారు. రైతుల రుణమాఫీ అంశాన్ని ఎన్నికల హామీగా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు 25 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ చేసినట్లు ఆయన వెల్లడించారు. వరి సాగు చేస్తే బోనస్ ఇవ్వడం, 48 గంటల్లో నగదు జమ చేయడం వంటి చర్యలు రైతుల్లో విశ్వాసాన్ని కలిగించాయని రేవంత్ రెడ్డి చెప్పారు.
మహిళలు కోటీశ్వరులు కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాగుతున్నట్లు తెలిపారు సీఎం. రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు, సౌర విద్యుత్ ఉత్పత్తి, ఐకేపీ కేంద్రాల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల అద్దె, ఆహార పదార్థాల సరఫరా వంటి అవకాశాలను మహిళలకే అప్పగించినట్టు వివరించారు. "ఇది మహిళల శక్తిని సద్వినియోగం చేయడమే కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే" అని ఆయన అన్నారు.
గాంధీ భవన్‌లో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రేవంత్ పార్టీ నేతల పనితీరుపై గట్టిగా స్పందించారు. "పని చేయని వారికి పదవులు ఉండవు. డిమోషన్ తప్పదు. కానీ పనిచేసే వారికి ప్రమోషన్ ఉంటుంది" అని తేల్చిచెప్పారు. "పదవులు అడగడం తప్పు కాదు కానీ ధర్నాలు చేయడం తప్పు" అంటూ నేతలకు హెచ్చరిక చేశారు. నాయకుల పనితీరును రెండు జాబితాలుగా విభజించి గమనించనున్నట్లు తెలిపారు.
గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. "కేసీఆర్ చెప్పిన తేదీకే చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆధారాలతో అసెంబ్లీలో ముందుకు వస్తా. కేసీఆర్ సిద్దమా?" అంటూ పరోక్షంగా ఆహ్వానం అందించారు.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికల వంటి కీలక అంశాలు ముందున్నాయని సీఎం స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పార్టీని సిద్ధం చేయాలని అన్నారు. "ఇది మా పాలనకు గోల్డెన్ పీరియడ్. ప్రజల మద్దతు ఉంది. పార్టీలో ఐక్యత ఉంటే, 2029లో మళ్లీ అధికారంలోకి వస్తాం" అని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
"ఇది గోల్డెన్ పీరియడ్" అంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రూ.95,351 కోట్లను సంక్షేమానికి ఖర్చు చేసినట్టు వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 4500 ఇండ్లు, 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందుతున్నదని తలిపారు. పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.