విజృంభిస్తోన్న కరోనా: అప్రమత్తమైన ఈటల, మహారాష్ట్ర సరిహద్దు అధికారులకు ఆదేశాలు

By Siva KodatiFirst Published Mar 12, 2021, 8:29 PM IST
Highlights

దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల అధికారులు, ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల అధికారులు, ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రోజుకు కనీసం 50వేలకు తగ్గకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.  సరిహద్దు జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: మరో రెండు జిల్లాల్లో లాక్‌డౌన్, పుణెలో నైట్ కర్ఫ్యూ

టెస్టింగ్‌తో పాటు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేవారిని గుర్తించి ఎప్పటికప్పుడు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఈటల ఆదేశించారు. ఈ మేరకు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వైద్యాధికారులకు రాజేందర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.  

కాగా, తెలంగాణలో ఇవాళ కొత్త‌గా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 163 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,717 కి చేరింది. ఇప్పటివరకు 2,97,195 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,650గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,872 యాక్టివ్ కేసులున్నాయి.

click me!