మణిపూర్‌ హింస : తెలుగు విద్యార్ధుల అవస్థలు, స్పందించిన తెలంగాణ సర్కార్.. రేపు ప్రత్యేక విమానాలతో రెస్క్యూ

Siva Kodati |  
Published : May 06, 2023, 07:29 PM ISTUpdated : May 06, 2023, 07:33 PM IST
మణిపూర్‌ హింస : తెలుగు విద్యార్ధుల అవస్థలు, స్పందించిన తెలంగాణ సర్కార్.. రేపు ప్రత్యేక విమానాలతో రెస్క్యూ

సారాంశం

మణిపూర్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలుగు విద్యార్ధులు  బిక్కుబిక్కుమంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. విద్యార్ధులను రక్షించేందుకు గాను రేపు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాలను మణిపూర్‌కు పంపనుంది.  

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాత్మక ఘటనలతో రణరంగాన్ని తలపిస్తోంది. అల్లర్లను, ఘర్షణను కట్టడి చేసేందుకు కనిపిస్తే కల్చివేతకు గవర్నర్ ఆదేశించారు. దీంతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు మణిపూర్ హింస కారణంగా ఇక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంఫాల్‌లోని నీట్ సహా మణిపూర్‌లోని పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో తెలుగు విద్యార్ధులు చదువుకుంటున్నారు.

హింస కారణంగా వారు గదుల్లోనే వుండిపోవాల్సి వచ్చింది. తినడానికి తిండి లేక పస్లువు వుండాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఒక్క మణిపైర్ ఎన్ఐటీలోనే 150 మంది వరకు తెలుగు విద్యార్ధులు చదువుకుంటున్నారు. దీంతో తమ పిల్లల క్షేమ సమాచారంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి తమ పిల్లలను క్షేమంగా స్వస్థలాలకు చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ALso Read: క్షణక్షణం.. భయం భయం .. మణిపూర్‌లో బిక్కుబిక్కుమంటోన్న తెలుగు విద్యార్ధులు, తినడానికి తిండి కూడా లేక

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను రక్షించేందుకు రేపు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాలను పంపనుంది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ విద్యార్ధులకు భరోసా కల్పించారు. మణిపూర్‌లో వున్న 50 మంది తెలుగు విద్యార్ధులు తమకు సమాచారం అందించారని ఆయన తెలిపారు. విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన పని లేదని.. వారిని రెస్క్యూ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అంజనీ కుమార్ స్పష్టం చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానం రానుంది. ఈ మేరకు మణిపూర్ సర్కార్‌తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, డీజీపీ అంజనీ కుమార్ సమన్వయం చేసుకుంటున్నారు. మణిపూర్‌లో దాదాపు 250 మంది తెలంగాణ విద్యార్ధులు చదువుతున్నట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలకు ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నాయకత్వం వహిస్తోంది. బుధవారం గిరిజన సంఘీభావ యాత్రలో హింసాత్మక సంఘటనలు నమోదవడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. అయితే తమకు సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను గిరిజనుల నిరసనలకు నాయకత్వం వహిస్తున్న సంఘం ఖండించింది.

కర్ఫ్యూ, ఇంటర్నెట్ నిలిపివేత
గిరిజనుల ఆందోళన సందర్భంగా హింస చెలరేగడంతో మణిపూర్ ప్రభుత్వం ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. గిరిజనేతరులు అధికంగా ఉండే ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, తౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతో పాటు గిరిజనులు అధికంగా ఉండే చురచంద్పూర్, కాంగ్పోక్పి, తెంగ్నౌపాల్ జిల్లాల్లో దీనిని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్