
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాత్మక ఘటనలతో రణరంగాన్ని తలపిస్తోంది. అల్లర్లను, ఘర్షణను కట్టడి చేసేందుకు కనిపిస్తే కల్చివేతకు గవర్నర్ ఆదేశించారు. దీంతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు మణిపూర్ హింస కారణంగా ఇక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంఫాల్‌లోని నీట్ సహా మణిపూర్‌లోని పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో తెలుగు విద్యార్ధులు చదువుకుంటున్నారు.
హింస కారణంగా వారు గదుల్లోనే వుండిపోవాల్సి వచ్చింది. తినడానికి తిండి లేక పస్లువు వుండాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఒక్క మణిపైర్ ఎన్ఐటీలోనే 150 మంది వరకు తెలుగు విద్యార్ధులు చదువుకుంటున్నారు. దీంతో తమ పిల్లల క్షేమ సమాచారంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి తమ పిల్లలను క్షేమంగా స్వస్థలాలకు చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ALso Read: మణిపూర్‌లో హింస.. కనిపిస్తే కాల్చివేత!.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలకు ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నాయకత్వం వహిస్తోంది. బుధవారం గిరిజన సంఘీభావ యాత్రలో హింసాత్మక సంఘటనలు నమోదవడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. అయితే తమకు సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను గిరిజనుల నిరసనలకు నాయకత్వం వహిస్తున్న సంఘం ఖండించింది.
కర్ఫ్యూ, ఇంటర్నెట్ నిలిపివేత
గిరిజనుల ఆందోళన సందర్భంగా హింస చెలరేగడంతో మణిపూర్ ప్రభుత్వం ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. గిరిజనేతరులు అధికంగా ఉండే ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, తౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతో పాటు గిరిజనులు అధికంగా ఉండే చురచంద్పూర్, కాంగ్పోక్పి, తెంగ్నౌపాల్ జిల్లాల్లో దీనిని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ శక్తుల కుట్ర, కార్యకలాపాలను అడ్డుకోవడానికి, శాంతి, మత సామరస్యాన్ని కాపాడటానికి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు, ప్రాణాలకు నష్టం జరకుండా చూసేందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొంటూ హోమ్ శాఖ కమిషనర్ హెచ్ జ్ఞాన్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వివిధ సామాజిక వేదికల ద్వారా తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తిని నిరోధించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. మణిపూర్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న కేంద్రం.. మరోసారి అల్లర్లు చెలరేగితే అదుపులో పెట్టేందుకు ప్రత్యేక దళమైన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలను కూడా హింసాత్మక ప్రాంతాలలో మోహరించడం కోసం పంపింది.