
తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న మెడికల్ రియింబర్స్ మెంట్ బిల్లుల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బిల్లులన్నింటిని క్లియర్ చేసి మొత్తం నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తాజాగా కీలక ప్రకటన చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ పెట్టిన మెడికల్ రియింబర్స్ మెంట్ బిల్లులను కూడా విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇలా 04- 03- 2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి రూ.180.30 కోట్ల మెడికల్ రియింబర్స్ మెంట్ బిల్లులను ఒకేసారి క్లియర్ చేసినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం లెక్కకు మించి ఖర్చు చేస్తోందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రాధాన్యత ఇస్తోందని... వారికి తగిన ప్రయోజనాలు కల్పిస్తోందని అన్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులను క్లియర్ చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. దీనివల్ల 26,519 మందికి ఊరట లభిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.
ఇదిలావుంటే ఇటీవల తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా రేవంత్ సర్కార్ 2 శాతం DA పెంచింది... దీంతో 14.074 శాతంగా ఉన్న డిఏ 16.018 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖపై రూ.11 వేల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని... అయినా ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
గత శనివారం జూన్ 21 ఈ డిఏ పెంపు ప్రకటన చేశారు మంత్రి భట్టి విక్రమార్క. దీంతో రాష్ట్రంలోని 71,417 మంది విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది కలుగుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. డిఏ పెంపుపై హర్ష్యం వ్యక్తంచేస్తూ ప్రభుత్వానికి, మంత్రి భట్టి విక్రమార్కకు విద్యుత్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.