
కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఆదివారం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద జరిగిన సెయిలింగ్ వీక్ ముగింపు వేడుకలకు గవర్నర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హుస్సేన్ సాగర్ పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ సరస్సు తెలంగాణకు గిఫ్ట్ లాంటిదని, కాని ఇది ఇప్పుడు కాలుష్యంతో నిండిపోయిందన్నారు. గతంలో ఇందులో చేపలు , కప్పలు కనిపించేవని.. కానీ ఇప్పుడు కాలుష్యం కారణంగా అవి కనిపించడం లేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.
హుస్సేన్ సాగర్‌ను శుభ్రంగా వుంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని తమిళిసై అన్నారు. వచ్చే ఏడాది నాటికి దానిని శుభ్రంగా వుంచుతారని ఆమె ఆకాంక్షించారు. హుస్సేన్ సాగర్‌లో జాతీయ, అంతర్జాతీయ సెయిలర్లు సెయిలింగ్ చేస్తూ వుంటారని తమిళిసై అన్నారు. ఎంతోమంది ప్రతిభావంతులైన సెయిలర్స్‌ని హుస్సేన్ సాగర్ ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. నీటిలో గాలిని తట్టుకుని పడవను నడపాల్సి వుంటుందని.. అలాగే జీవితంలో కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలని తమిళిసై పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన మాన్య రెడ్డి ఏషియన్ సెయిలింగ్ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా వుందని గవర్నర్ ప్రశంసించారు.
ALso Read: రాజకీయాలు మాట్లాడే హక్కు గవర్నర్‌లకు ఉంది.. గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు..
అంతకుముందు తమిళిసై సౌందర్‌రాజన్ తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం విలేకరులతో మాట్లాడుతూ... రాజకీయాలు మాట్లాడే హక్కు గవర్నర్‌లకు కూడా ఉందని అన్నారు. రాజకీయ చర్చల్లో పాల్గొనేందుకు రాజకీయ పార్టీల నేతలకు ఉన్న హక్కు గవర్నర్‌లకు ఉంటుందని.. వారి అభిప్రాయాలను ముందుకు తెచ్చే హక్కు ఉందని గవర్నర్ తెలిపారు. ‘‘రాజకీయ చర్చల్లో అందరూ పాల్గొంటారు కాబట్టి గవర్నర్‌లకు కూడా ఆ చర్చకు స్వేచ్ఛ ఉండాలి’’ అని తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. గవర్నర్ అభిప్రాయంతో విభేదాలు వ్యక్తం చేసినప్పటికీ.. వారి పట్ల నిరసన వ్యక్తం చేయడం లేదా శత్రుత్వం ప్రదర్శించడం మంచి రాజకీయాలకు అనుకూలం కాదని ఆమె ఉద్ఘాటించారు.