తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కేసీఆర్ సర్కార్ పై పరోక్ష విమర్శలు చేశారు. రాష్ట్ర సర్కార్ తనతో వ్యవహరిస్తున్న తీరును ఆమె మరోసారి చెప్పారు.
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. ఈ విమర్శలను తట్టుకొంటూ ముందుకు సాగుతున్నట్టుగా గవర్నర్ తెలిపారు.సోమవారం నాడు రాజ్ భవన్ లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. మహిళపై రాళ్లు వేసిన వారికి పూలదండలు వేస్తున్నారని తమిళిసై పరోక్షంగా బీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఇలా చేయడంతో ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. తనను తిట్టినవారిపై చర్యలు తీసుకోకుండా అవార్డులు ,రివార్డులు ఇస్తున్నారన్నారు.
రాష్ట్రంలోని మహిళా ప్రజా ప్రతినిధులందరికి ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు పంపినట్టుగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. ఈ కార్యక్రమానికి అందరూ రాకున్నా వచ్చినవారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న మహిళల కోసం ప్రజా దర్భార్ నిర్వహించిన విషయాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గుర్తు చేశారు. ప్రజా దర్బార్ లో సుమారు వెయ్యికిపైగా ధరఖాస్తులు వచ్చిన విషయాన్ని గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటిని పరిష్కరించే దిశగా ప్రయత్నలు చేస్తున్నామని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు.ఎంతో టాలెంట్ ఉన్న ప్రీతిని పోగొట్టుకున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను మహిళల కోసం పనిచేస్తూనే ఉంటానన్నారు.
తనను ఎన్ని మాటలన్నా పట్టించుకోనని ఆమె చెప్పారు. ఓ సోదరిలా రాష్ట్రానికి సేవ చేస్తానని తమిళిసై తెలిపారు. తనకు ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు లేవని గవర్నర్ తేల్చి చెప్పారు. గవర్నర్ గా తన పరిధికి లోబడి పనిచేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేయవద్దని కూడా ఆమె కోరారు. ఎన్ని విమర్శలు చేసినా వివక్ష చూపినా వెనక్కి తగ్గబోనని గవర్నర్ చెప్పారు.
రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ కొనసాగుతుంది. 10 పెండింగ్ బిల్లులను ఆమోదింపజేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హోలి పండుగ సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిగే అవకాశం ఉంది.
also read:తెలంగాణ గవర్నర్ తమిళిసై - మంత్రి హరీశ్ రావు మధ్య ట్విట్టర్ వార్
గత మాసంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు. దీంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సయోధ్య కుదిరిందని భావించారు. కానీ పెండింగ్ బిల్లుల అంశంలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ కొనసాగుతుందని తేలింది.