తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లారు.
హైదరాబాద్:తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆదివారంనాడు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో పలువురితో గవర్నర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ నివేదిక అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించడం , హైకోర్టులో కేసీఆర్ లంచ్ మోషన్ పిటిషన్, రిపబ్లిక్ డే వేడుకల విషయమై ఘటనలను గవర్నర్ కేంద్రానికి వివరించే అవకాశం లేకపోలేదు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేసీఆర్ మధ్య సయోధ్య కుదిరినట్టే కన్పిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ నెల 3వ తేదీన ప్రారంభించారు. అయితే ఈ పరిణామానికి ముందు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
గత నెల 30వ తేదీన బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపలేదని హైకోర్టులో కేసీఆర్ సర్కార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలను విన్పించారు. అయితే ఈ విషయమై విచారణ చేసిన హైకోర్టు ఇరువర్గాల న్యాయవాదులు చర్చించుకోవాలని సూచించింది. దీంతో లంచ్ బ్రేక్ సమయంలో ఇరువర్గాల న్యాయవాదులు కూర్చుని చర్చించుకున్నారు.
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ ను విమర్శించడం సరైంది కాదని గవర్నర్ తరపు న్యాయవాది ఆశోక్ చెప్పారు. రాజ్యాంగబద్దంగా ప్రభుత్వం వ్యవహరించాలని కూడ గవర్నర్ తరపు న్యాయవాది కోరారు. ఈ విషయమై ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా అంగీకరించారు. ఇదే విషయాన్ని ఇరువర్గాల న్యాయవాదులు హైకోర్టుకు చెప్పారు. లంచ్ మోషన్ పిటిషన్ ను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
also read:గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు: కేసీఆర్ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
గత నెల 30వ తేదీన రాత్రి రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని ఆహ్వానించారు.