
అహంకారం, నియంతృత్వం చెల్లదని తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడారని చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా శుక్రవారం ఆమె నాంపల్లి పబ్లిక్ గార్డెలో జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు గవర్నర్ అక్కడికి చేరుకున్నవెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్.. మొదటి స్పందన ఏంటంటే ?
భారతదేశం, భిన్న జాతులు, మతాలు, కులాల సమహారమని తెలంగాణ గవర్నర్ తమిళిసై చెప్పారు. కానీ రాజ్యాంగం అందరినీ ఏకం చేసిందని చెప్పారు. ఒకే జాతిగా నిలబెట్టిందని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం బడుగుల జీవితాల్లో వెలుగులు నిపేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగం చూపిన బాటలో ముందుకు వెళ్తుందని తెలిపారు.
పాలకులు ఎవరూ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహిరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని గవర్నర్ అన్నారు. ప్రజలు పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని కూడా కంట్రోల్ చేయగలరని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆమె అన్నారు. గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని అన్నారు.
నియంతృత్వ ధోరణితో ముందుకు సాగాడాన్ని తెలంగాణ ప్రజలు సహించబోరని తెలిపారు. అందుకే ఎన్నికల తీర్పుతో దానికి చరమగీతం పాడారని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. నియంతృత్వం, అహంకారం చెల్లబోదని తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని గవర్నర్ అన్నారు. అలాగే ఉద్యోగాల భర్తీపై యువత ఎలాంటి అపోహలకూ గురికావద్దని సూచించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన పూర్తి అయిన వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు అవుతుందని ఆమె హామీ ఇచ్చారు.