Padma Awards 2024:ప్రతిష్టాత్మక 'పద్మ' అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. అందులో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. వీరిలో పలువురు తెలుగువారికి కూడా ‘పద్మ’ పురస్కారాలు దక్కాయి. వారెవరో మీకు కూడా ఓ లూక్కేయండి.
Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations)సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2024) ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. వీటిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. వీరిలో పలువురికి పద్మపురస్కారాలు దక్కాయి. దేశంలోని అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు మన తెలుగువారైన మెగాస్టార్ చిరంజీవి, మాజీ రాష్ట్ర రాష్ట్రపతి వెంకయ్య నాయుడులకు దక్కింది.
భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న చిరంజీవికి ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే.. సామాజిక సేవా రంగంలో ఆయన చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి.
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకి కూడా ‘పద్మవిభూషణ్’ పురస్కారం దక్కింది. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు. రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఆరుగురికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరిని పద్మ శ్రీ అవార్డు దక్కింది. అలాగే.. తెలంగాణ నుంచి బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, నారాయణపేట జిల్లా దామరగిడ్డకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యతో పాటు వేలు ఆనందాచారి (కళలు), కేతావత్ సోమ్‌లాల్ (సాహిత్యం, విద్య), కూరెళ్ల విఠలాచార్య (సాహిత్యం, విద్య)లకు పద్మ శ్రీ అవార్డు దక్కింది.