తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని రంగారెడ్డి జిల్లాలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, మహేందర్ రెడ్డిలు ప్రారంభించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, మహేందర్ రెడ్డిలు శుక్రవారం నాడు ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటి నుండి పదో తరగతి చదువుకునే విద్యార్థులకు ఈ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్నారు. స్కూల్ ప్రారంభానికి అరగంట ముందే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల ఈ పథకాన్ని మంత్రులు ప్రారంభించారు.
ఆరు రోజుల పాటు ప్రతి రోజూ ఒక్కో రకం మెనూను విద్యార్థులకు అందించనున్నారు. ఏ రోజు ఏ మెనూను అందించాలో కూడ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సోమవారం నాడు ఉప్మా లేదాఇడ్లీ, సాంబార్ అందించనున్నారు. మంగళవారంనాడు టమాటబాత్ లేదా పూరీ ఆలు కర్రీని అందిస్తారు.బుధవారం నాడు కిచీడీ లేదా ఉప్మా, గురువారం నాడు మిల్లెట్ ఇడ్లీ లేదా సాంబార్ లేదా పొంగల్ ఇవ్వనున్నారు. శుక్రవారం నాడు ఉగ్గాని లేదా మిల్లెట్ ఇడ్లీ లేదా గోధుమ రవ్వ కిచిడీ ఇవ్వనున్నారు. శనివారం నాడు వెజిటేబుల్ పొలావ్ లేదా పొంగల్ లేదా రైతా ఆలు కర్రీని అందించనునన్నారు.
ఈ పథకం అమలు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ. 400 కోట్లు అదనపు భారం పడనుంది. ఇటీవలనే తెలంగాణ రాష్ట్రంలో ఇదే తరహా పథకాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. అయితే ఆరో తరగతి వరకు మాత్రమే తమిళనాడు రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.తెలంగాణలో మాత్రం టెన్త్ వరకు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.