Telangana Election Results : కర్ణుడి చావుకి... కేసీఆర్ ఓటమికి సవాలక్ష కారణాలు...

By SumaBala Bukka  |  First Published Dec 3, 2023, 12:47 PM IST

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఓటమి అంచుకు చేరుకుంది. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటో ఒకసారి చూద్దాం. 


‘ఔర్ ఏక్ దక్కా.. తెలంగాణ పక్కా’ నినాదంతో.. వేలాదిమంది యువత ఆత్మబలిదానాలతో.. యేళ్లతరబడి అలుపెరుగని పోరాటం ఫలితం.. దశాబ్దల కలసాకారం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు. తెలంగాణ సాధనలో ముందుండి నడిపించిన నాయకుడికే ప్రత్యేక రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పట్టం గట్టారు ప్రజలు. 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ను గెలిపించారు తెలంగాణ ప్రజలు. సొంతం రాష్ట్రంలో కలలు సాకారం అవుతాయని, యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని, నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతాయని వేచి చూశారు. ఈ ఆకాంక్షతోనే 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కే పట్టంకట్టింది తెలంగాణ.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. క్రమంగా పాలకుల్లో దొరతనం పెరిగింది. మేము తప్ప తెలంగాణకు దిక్కులేదన్న ధోరణి పెరిగింది. ప్రతిపక్షం పెరగకుండా అణగదొక్కడం కూడా తాము చేసేదంతా సరైనదే అనే భావన పెరిగేలా చేసింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా.. మూడోసారి ముచ్చటగా గెలిచి.. హ్యాట్రిక్ సీఎంగా ఆవిర్భవించాలనుకున్న కేసీఆర్ ఆశలు గల్లంతు కావడానికి కూడా అన్ని కారణాలే ఉన్నాయి.

Latest Videos

వీటిల్లో మొదట చెప్పుకోవాల్సింది. నిరుద్యోగ సమస్య.. తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని యువతకు ఉపాధికి హామీ ఇచ్చిన ప్రభుత్వం గడిచిన పదేళ్లలో కూడా అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేదు. పైగా నోటిఫికేషన్లు వేయకపోవడం, వేసిన వాటికి పేపర్లు లీకవడం, ఇంటర్ లీకేజీ, ఏపీపీఎస్‌సీ లీకేజి, గ్రూప్స్ ఎగ్జామ్స్ వాయిదా... గందరగోళం యువతలో అసహనాన్ని పెంచింది. 

Telangana Election Results: బీఆర్ఎస్ మంత్రుల్లో మొదలైన భయం..!

రెండోది భూకబ్జాలు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా భూకబ్జాలు కొంత ఉంటాయి. కానీ బంగారు తెలంగాణ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎక్కడ ఖాళీ భూమి కనబడితే అక్కడ భూములను కబ్జా చేయడం. ప్రభుత్వ భూములను వేలం వేయడం లాంటివి అపనమ్మకాన్ని పెంచాయి. 

మూడోది అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది..ధరణి పోర్టల్ పేరుతో జరుగుతున్న దుర్మార్గాలు. ధరణి పోర్టల్ వల్ల కౌలు రౌతులు, పోడురైతులు తీవ్రంగా నష్టపోయారు. భూస్వాములకే ఇది బాగా ఉపయోగపడిందన్న విమర్శులు ఉన్నాయి. చాలాచోట్ల ప్రజలకు పంచిన భూములు కూడా ధరణిలో ఆయా భూస్వాముల పేరుతో ఉండడం, రైతుబంధు కూడా వారికి అందుతున్న ఘటనలు ఉన్నాయి. 

కాలేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో లక్షల కోట్ల అవినీతి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ లో పగులు రావడం అవినీతిని బట్టబయలు చేసింది. నాణ్యతా లోపాలను ఎత్తి చూపింది. 

దళితబంధు...దళితులను ఆర్థికంగా స్థిరపడేలా, ఆత్మగౌరవంతో బతికేలా చేయడానికి ప్రవేశపెట్టిన దళితబంధు దుర్వినియోగం అయిందన్న విమర్శ. కేవలం అధికార పార్టీకి చెందిన వారికి, ఎమ్మెల్యేల అనుచరులకు మాత్రమే దళితబంధు అందడం, అందులో కూడా కమిషన్లు, లంచాలు, పర్సంటేజీలు తీసుకోవడం.

డబుల్ బెడ్రూం ఇండ్లు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. పేద, అణగారిన వర్గాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న ప్రభుత్వం సఫలం కాలేకపోయింది. కొన్నిచోట్ల వాటిని ఇచ్చినప్పటికీ అగ్గిపెట్టెల్లా ఉన్న రూంలు, కనీస సౌకర్యాలు లేకపోవడం కూడా ఒక కారణమే. 

దళితబందు లాగా బీసీబంధు కూడా ప్రవేశపెడతామన్న మాటలు నీటిమూటలే అయ్యాయి. ఇది మభ్యపెట్టే చర్యగా మారిపోయింది. 

భూకబ్జాల తరువాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సహజవనరుల దోపిడి. ఇసుక మాఫియా. యధేచ్ఛగా సహజవనరులను దోపిడీ చేయడం కూడా నిరాసక్తతకు కారణం.. 

వీటితో పాటు మరిన్ని కారణాలు ఇవే.. 

- అమరవీరుల కుటుంబాల్లో సగమే గుర్తించడం, గుర్తించిన వారికి కూడా ఉద్యోగాలు, భూములు ఇవ్వకపోవడం. 
- సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత
- మల్లన్న సాగర్ నిర్వాసితులకు అందాల్సిన సహాయం పూర్తిగా అందకపోవడం, బలవంతంగా నిర్వాసితులను చేయడం, హామీ ఇచ్చిన పరిహారాలు పూర్తిగా అందించకపోవడం
- గల్ఫ్ బోర్డు ఏర్పాటు, చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం అనే అంశాలను పదేళ్లుగా మరిచిపోయారు. ఈసారి ఎన్నికల ప్రచారం చివరి రోజు వీటిని జనవరిలో తీరుస్తామని చివరి నిమిషంలో కేటీఆర్ హామీ ఇవ్వడం. 
- గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ప్రవళ్లిక ఆత్మహత్యను.. అసంబద్ధంగా చిత్రీకరించడం. 
- మీడియా మేనేజ్మెంట్.. తమకు వ్యతిరేక వార్తలు రాకుండా తొక్కేయడం..
- తెలంగాణ అంటే కుటుంబ పాలనగా, గడీలో దొరల పాలనగా మారిపోవడం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్..ఆ ఐదుగురు తప్ప వేరేవారు కనిపించకపోవడం. 
-నిజాలు మాట్లాడేవారి పట్ల నిర్ధయగా వ్యవహరించటం
- కేసీఆర్ పై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోవడం
- జాతీయ పార్టీ పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత రాష్ట్ర సమితిగా మార్చడం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లుగా ప్రజలు భావించడం.
- అవినీతిపరులైన పార్టీ నాయకులను వెనకేసుకు రావడం, వారిమీద కేసులు, ఆరోపణలు లేకుండా చూసుకోవడం 
- స్వయంగా కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడం, అరెస్టవ్వకుండా మేనేజ్ చేసుకున్నారన్న ఆరోపణలు
- బీజేపీలో లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయన్న ఆరోపణలు, ఎన్నికలకు ముందు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు దీనికి నిదర్శనంగా చూడడం. 
- 2014లో గెలిచినప్పుడు ఉద్యోగులకు వరాలు, రెండోసారి నిర్లక్ష్యం చేయటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత
- ఉద్యమపార్టీ అయిన బీఆర్ఎస్ ఉద్యమకారులను దూరం చేసుకోవటం
- తెలంగాణ సాధనలో కీలక భూమిక వహించిన ఆర్టీసీ కార్మికుల పట్ల అమానవీయంగా వ్యవహరిచడం, ఆర్టీసీలో యూనియన్లే లేకుండా చేసి సమ్మెను అణిచివేయటం
- సింగరేణిలో ఓపెన్ కాస్ట్ గనులను మూయిస్తామని చెప్పిన హామీలు నెరవేరకపోవడం, ఉద్యోగులు ఈ పదేళ్లలో సగానికి సగం తగ్గిపోవడం, కొత్త ఉద్యోగాలు లేకపోవడం 
- ఉద్యమంతో సంబంధం లేని పార్టీల నుంచి వచ్చిన వారికి టీఆర్ఎస్ లో ముఖ్య పదవులు ఇవ్వడం 
- పదేళ్లు చూసింది చాలు అని ప్రజలు అనుకోవడం. ఈసారి వేరేవారికి అవకాశం ఇద్దాం అని తెలంగాణ ప్రజానీకం అనుకోవడం. 
- కేసీఆర్, కేటీఆర్ తో సహా ఆ పార్టీకి చెందిన అందరు నాయకుల్లో అహం పెరగడం.. మాటల్లో, చేతల్లో అది కనిపించడం కూడా ఒక కారణం.
- తెలంగాణ రాకముందే జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ కింద జర్నలిస్టులు కొనుక్కున భూములను.. కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ వారికి కేటాయించకపోవడం
- సామాన్య ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవాలనుకుంటే మంత్రులు, శాసనసభ్యులు అందుబాటులో లేకపోవడం.

click me!