సామాన్యూడి నుండి అపర కుభేరులు అదానీ, అంబానీల వరకు సైబర్ నేరగాళ్ళు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇలా తాను కూడా సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కినట్లు తెలంగాణ డిజిపి రవిగుప్తా తెలిపారు. ఎలా మోసపోయారో స్వయంగా ఆయనే వివరించారు.
హైదరాబాద్ : మనం ఎవరి చేతిలోనైనా మోసపోతే పోలీసుల వద్దకు వెళతాం... కొందరు పోలీసులు కూడా మోసగాళ్ల బారిన పడుతుంటారు... వాళ్లు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తారు. కానీ పోలీస్ బాసే సైబర్ నేరగాళ్ల బారినపడితే ఎవరికి చెప్పుకోవాలి... అలాంటి పరిస్థితే తెలంగాణ డిజిపి రవిగుప్తాకు ఎదురయ్యిందట. అయితే ముందుగానే అప్రమత్తంగా వుండటంతో మోసగాళ్లు డిజిపిని ఏం చేయలేకపోయారట. ఇలా సైబర్ నేరగాళ్లు తనను ఎలా మోసం చేయడానికి ప్రయత్నించారు... వారి నుండి ఎలా తప్పించున్నారో స్వయంగా తెలంగాణ పోలీస్ బాస్ బయటపెట్టారు.
హైదరాబాద్ లోకి పొలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిజిపి రవిగుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల నియంత్రణ, ప్రజలకు అవగాహన కల్పించే అంశాలపై డిజిపి మాట్లాడారు. సైబర్ నేరాల బారినపడే వారిలో ఎక్కువగా చదువుకున్న వారే వుంటున్నారని... తాను కూడా ఇలాగే సైబర్ మోసగాళ్ల బారిన పడినవాడినే అని డిజిపి తెలిపారు.
ఓసారి విమానాశ్రయంలో వుండగా తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని... విమానం కోసం ఎదురుచూస్తూ ఖాళీగానే కూర్చున్నాను కాబట్టి మాట్లాడానని డిజిపి రవిగుప్తా తెలిపారు. అయితే ఆ వ్యక్తి తనను మాటలతో నమ్మించి కొన్ని యూట్యూబ్ లింక్స్ ను పంపించాడని... వాటికి లైక్స్ కొడితే డబ్బులు వస్తాయని చెప్పాడన్నారు. ఇలా మాటలతో మభ్యపెట్టడంతో వారు చెప్పినట్లే యూట్యూబ్ వీడియోలకు లైక్స్ కొట్టానని... దీంతో తన బ్యాంక్ వివరాలు వారికి చేరిపోయాయని తెలిపారు. తనను మరింతగా ప్రలోభ పెట్టేందుకు రూ.150 తన ఖాతాలో వేసారని అన్నారు. కానీ తన ఖాతాలో డబ్బులు లేకపోవడంతో వదిలేసారని రవిగుప్తా తెలిపారు. ఇలా సైబర్ నేరగాళ్ల బారినపడ్డా ముందుజాగ్రత్తతో వుండటంవల్లే తాను మోసపోలేదని డిజిపి అన్నారు.
Also Read ప్రభుత్వ ఉద్యోగాల కోసం కుమారి ఆంటీ రికమండేషన్... నిరుద్యోగ యువత కోరిందిదే..!
సైబర్ నేరాల గురించి అవగాహన వుండటంతో తాను రెండు బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తానని... డబ్బులు దాచుకోడానికి ఒకటి, ఆన్ లైన్ పేమెంట్స్ కోసం మరోటి వాడతానని డిజిపి తెలిపారు. ఆన్ లైన్ పేమెంట్స్ చేయాల్సి వస్తే డబ్బులు దాచే ఖాతాలోంచి జీరో అకౌంట్ లోని ఖాతాలోకి డబ్బులు వేసుకుంటానని... దాన్నుంచి పేమెంట్స్ చేస్తానని తెలిపారు. ఇదే తనను సైబర్ నేరగాళ్ల నుండి కాపాడిందని... తన జీరో అకౌంట్ వివరాలను సంపాదించిన కేటుగాళ్ళు అందులో డబ్బులేమీ లేకపోవడంతో వదిలిపెట్టారని రవిగుప్తా తెలిపారు. ఇలా ప్రతిఒక్కరు సైబర్ మోసాలపై అవగాహన కలిగివుండాలని డిజిపి రవిగుప్తా సూచించారు.