ప్రభుత్వ ఉద్యోగాల కోసం కుమారి ఆంటీ రికమండేషన్... నిరుద్యోగ యువత కోరిందిదే..!

By Arun Kumar P  |  First Published Feb 4, 2024, 7:14 AM IST

హైదరాబాద్ లో రోడ్డు పక్కన ఫుడ్ సెంటర్ నిర్వహించుకుంటూ ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారీ ఆంటీని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించాలంటూ నిరుద్యోగ యువత మొరపెట్టుకున్నారు.


హైదరాబాద్ : కుమారి ఆంటీ... ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రోడ్డుపక్కన చిన్న ఫుడ్ సెంటర్ నిర్వహించుకునే ఆమెను సోషల్ మీడియా సెలబ్రిటీని చేసిపెట్టింది. ఆమె వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించరాదంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారంటేనే ఈ కుమారి ఆంటీ క్రేజ్ ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కుమారి ఆంటీ పాపులారిటీని ఉపయోగించుకుని తమ సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు కొందరు నిరుద్యోగ యువత.   

శనివారం కొందరు నిరుద్యోగులు హైదరాబాద్ లోని ఐటిసి కోహినూర్ హోటల్ వద్ద కుమారి ఆంటీ నిర్వహించే ఫుడ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. తమ నిరుద్యోగ సమస్యను సీఎం రేవంత్ కు తెలియజేయాలని ఆమెను కోరారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు, కుమారి ఆంటీ మధ్య వాగ్వాదం జరిగింది. నిరుద్యోగుల ఆందోళనతో కుమారీ ఆంటీ ఫుడ్ సెంటర్ వద్ద ట్రాఫిక్ జాం జరిగింది.

Latest Videos

undefined

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ నిరుద్యోగ సమస్య గురించి తెలియజేయాలని కుమారి ఆంటీని కోరారు యువత. మీ ఫుడ్ సెంటర్ లో భోజనం చేయడానికి సీఎం వస్తానన్నారుగా... అప్పుడు తమ నిరుద్యోగ సమస్యను ఆయన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ దరఖాస్తును సీఎంకు ఇవ్వాలంటూ కుమారికి ఇచ్చే ప్రయత్నం చేయగా ఆమె తీసుకోలేదు. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేలా కనిపించడం లేదని...  మీ వద్ద ప్లేట్లు కడిగే ఉద్యోగమైనా ఇవ్వాలంటూ కుమారి ఆంటీని కోరారు నిరుద్యోగులు. 

Also Read   కుమారీ ఆంటీపై డీజే సాంగ్: సోషల్ మీడియాలో వైరల్

ఈ క్రమంలో కుమారి ఆంటీ నిరుద్యోగులను సముదాయించే ప్రయత్నం చేసారు. మీ (నిరుద్యోగుల) సమస్య గురించి సీఎం రేవంత్ రెడ్డికి తెలిసివుంటుందని... తాను చెప్పాల్సిన అవసరమేమీ వుండదన్నారు కుమారి. రోడ్డుపక్కన చిరువ్యాపారం చేసుకునే తన సమస్య గురించే ఆయనకు తెలిసింది... మీ గురించి తెలియకుండా వుంటుందా? అన్నారు.  అందరి సమస్యలను సీఎం రేవంత్ తీరుస్తారని కుమారి ఆంటీ నిరుద్యోగులకు సూచించారు. 

ఇప్పటికే తన ఫుడ్ సెంటర్ వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని... ఇప్పుడిలా ఆందోళనలు చేపట్టి ఇబ్బంది పెట్టవద్దని నిరుద్యోగ యువతను కుమారి ఆంటీ కోరారు. తానేదో కుటుంబపోషణ కోసం ఫుడ్ సెంటర్ నడుపుకుంటున్నానని... పెద్ద పెద్ద విషయాలు తనకు తెలియవని అన్నారు. దయచేసి తనను ఇబ్బందిపెట్టి రోడ్డున పడేయవద్దని... ఇక్కడినుండి వెళ్లిపోవాలని కుమారి ఆంటీ నిరుద్యోగులను వేడుకున్నారు.  

కుమారీ ఆంటీ ఫుడ్ సెంటర్ వద్ద ఏం జరిగినా అది నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో తమ సమస్యను కూడా కుమారి ఆంటీ ద్వారానే సీఎం రేవంత్ తో పాటు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిరుద్యోగులు భావించినట్లున్నారు.  అందువల్లే ఆమె నిర్వహించే ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు.  
 

click me!