
తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఒక చేదు వార్తను జనాలకు అందించారు. తమ నిస్సహాయతను శాసనమండలిలో నిర్భయంగా ప్రకటించారు. ఏమాత్రం సంకోచం లేకుండా సభలో మాట్లాడారు. ఆ విషయంలో తామేమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఇంతకూ కడియం చెప్పిన చేదువార్త ఏమిటి? ఎందుకు అంత నిస్సహాయతలో ఆయన ఉన్నారు? ఈ విషయాల కోసం కింద వార్తను చదవండి.
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల క్రమబద్ధీకరణపై శాసనమండలిలో చర్చ జరిగింది. మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సవివరమైన సమాధానం ఇచ్చారు. దాపరికం లేకుండా మాట్లాడారు కడియం. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలలో అధిక ఫీజుల వసూలు చేస్తున్న మాట నిజమేనని అంగీకరించారు. దీనిలో దాచేదేమి లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అధిక ఫీజుల నియంత్రణ కోసం గత ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నం చేసిందన్నారు. అయినా సాధ్యపడలేదన్నారు. జీ. ఓ1 తీసుకొచ్చి జిల్లా ఫీజు నియంత్రణ కమిటీ ల సూచనల మేరకు ఫీజులు వసూలు చేయాలని చెప్పారు. కానీ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి కొట్టి వేయించారన్నారు. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టు కు వెళ్లినా జీ. ఓ ను అమలు చేసేందుకు ఒప్పుకోలేదన్నారు. దీనితో ఈ ప్రభుత్వం వచ్చాక అధిక ఫీజులు నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీ వేయాలని పలు విజ్ఞప్తులు, సూచనలు వచ్చాయన్నారు.
రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజుల క్రమబద్దీకరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ పాఠశాలల యాజమాన్యాలతో, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై సలహాలు, సూచనలు తీసుకుందని, 2017 నవంబర్ నెలాఖరుకు ఈ కమిటీ తన నివేదిక ఇవ్వడానికి గడువు అడిగిందని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు 162 స్కూళ్లలో తనిఖీలు చేసి వారికి నోటీసులు ఇచ్చామన్నారు. అయితే ఆయా పాఠశాలల యజమానులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయన్నారు. దీనితో ఇంకా ముందుకెళ్లి చర్యలు తీసుకోలేకపోయామన్నారు. వారి ఫీజుల వసూళ్లను అడ్డుకోలేకపోయామన్నారు. అధిక ఫీజులు వసూలు చేసి సరైన వసతులు కూడా కల్పించలేకపోతున్నారని వచ్చిన ఫిర్యాదుల పై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. గత 30 రోజులుగా కాలేజీలపై తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చామన్నారు. సరైన సమాధానం ఇవ్వకపోతే గుర్తింపు రద్దు చేస్తామని కూడా హెచ్చరించినట్లు తెలిపారు.
ఇక తల్లిదండ్రులు కూడా కాలేజీల పేర్లు చూసి మోసపోవద్దని, అధిక ఫీజులు, డోనేషన్లు చెల్లించి ఇబ్బందుల పాలు కావద్దని విజ్ఞప్తి చేశారు. స్కూల్, కాలేజీల వల్ల తల్లిదండ్రులు మోసపోకుండా ఉండేందుకు వచ్చే విద్యా సంవత్సరం మార్చి లోపు పాఠశాలలు, కళాశాలలకు అనుమతులు, గుర్తింపు ఇచ్చి ఆన్ లైన్ లో పెడుతామన్నారు. జిల్లావారిగా జాబితాలు రూపొందించి జాబితాలు విడుదల చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు.
వీటిని పరిగణనలోకి తీసుకొని ఓ. యూ మాజీ వీసీ తిరుపతి రావు అధ్యక్షతన కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ తన పని చేస్తోందని, నివేదిక ఇవ్వడానికి ఈ నెలాఖరు వరకు గడువు అడిగిందని చెప్పారు. కమిటీ తన నివేదిక ఇవ్వగానే అందులోని ప్రతిపాదనల మేరకు చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు.
మొత్తానికి కార్పొరేట్ విద్యాసంస్థలు ఎంత బలంగా ఉన్నాయో మంత్రి మాటలతో తేలిపోయిందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.