కాంగ్రెస్ రేవంత్ వేట షురూ

First Published Nov 5, 2017, 8:06 PM IST
Highlights
  • వేట షురూ చేసిన రేవంత్ రెడ్డి
  • సబితమ్మతో కలిసి తొలి ఆపరేషన్
  • రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ లోకి భారీగా టిడిపి నేతలు

కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పైకి గప్ చుప్ గా ఉంటూనే రాజకీయంగా సైలెంట్ ఆపరేషన్స్ చేసుకుంటూ పోతున్నారు. రేవంత్ రెడ్డి చాపకింద నీరులా తన పని తాను చేసుకుంటున్నారు. ఈనెల 8వ తేదీ వరకు ఎలాంటి రాజకీయ కసరత్తు చేయబోడని, ఎలాంటి పొలికల్  కామెంట్లు చేయకుండా మౌనంగా ఉంటాడని రేవంత్ సన్నిహితులు తెలిపారు. అయితే సందుట్లో సడేమియా అన్నట్లు తెరచాటు ఆపరేషన్లు మాత్రం కానిచ్చేస్తున్నాడు.

ఈనెల 8వ తేదీన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ రాజకీయాల్లో యాక్టీవ్ కావాలని రేవంత్ తలిచారు. ఈనెల 8వ తేదీన తన అభిమానులు, కార్యకర్తలు, నియోజకవర్గంలోని తనవాళ్లందరితో కలిసి మాట్లాడాలని ఆయన వర్గం చెబుతోంది. టిడిపిని వీడే సందర్భంలోనూ ఆయన అమరావతిలో రాజీనామా ఇచ్చి హైదరాబాద్ కు కూడా రాకుండా సక్కగ ఔటర్ రింగ్ రోడ్డు మీది నుంచి కొడంగల్ కే పోయిండు. అక్కడ తన నిర్ణయాన్ని వెల్లడించి కార్యకర్తలు, అభిమానులను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అంతకముందు రాజీనామా చేయక ముందు కూడా కొడంగల్ నుంచే ఆయన కార్యాచరణ చేపట్టిండు.

అయితే ఈనెల 8 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ మరింత దూకుడుగా వ్వవహరించే చాన్స్ ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే అప్పటివరకు రాజకీయపరమైన వ్యూహాత్మక మౌనం పాటిస్తాడని చెబుతున్నారు. కానీ ఆదివారం మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆపరేషన్ చేపట్టారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన చేపట్టిన తొలి ఆపరేషన్ ఇదే కావడం గమనార్హం. సబితతో కలిసి రంగారెడ్డి జిల్లాలో భారీ జాయినింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ జాయినింగ్ ఆపరేషన్ రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. ఉదయ్ మోహన్ రెడ్డి తో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో సబిత తనయుడు కార్తీక్ రెడ్డి కూడా హాజరయ్యారు.

మొత్తానికి రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉంటూనే కాంగ్రెస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరికలను చేపట్టడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. ఈనెల 8 తర్వాత ఇంకా పెద్ద లీడర్లు సైతం కాంగ్రెస్ గూటికి రేవంత్ సమక్షంలో చేరతారని అంటున్నారు. వారంతా ఇప్పటికే రేవంత్ తో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు.

click me!