గెలుపే ల‌క్ష్యం... కర్ణాటక తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ ఐదు హామీలు !

By Mahesh Rajamoni  |  First Published Jun 10, 2023, 5:09 PM IST

Hyderabad: కర్ణాటక తరహాలో ఐదు హామీలు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ యోచిస్తోంది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ హామీల నుంచి ఐదు ప్రధాన హామీలను ఖరారు చేసేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నార‌ని స‌మాచారం.
 


Telangana Assembly Election-Congress: ఇటీవ‌ల క‌ర్నాట‌క అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తిరుగులేని విజ‌యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ విజ‌యంలో కాంగ్రెస్ ప్ర‌క‌టించిన మేనిఫెస్టో లోని ప‌లు హామీలు కీల‌క పాత్ర పోషించాయి. క‌ర్నాట‌క త‌ర‌హాలోనే తెలంగాణ‌లోనూ అధికారపీఠం ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్ వ్యూహాలు ర‌చిస్తోంది. గత నెలలో అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో ఇచ్చిన హామీల తరహాలోనే ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఐదు హామీలు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోంది. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, రూ.500కే ఎల్పీజీ సిలిండర్, ప్రతి నిరుద్యోగ గ్రాడ్యుయేట్ కు నెలకు రూ.4 వేల భృతి, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగ‌ ఖాళీల భర్తీ, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో పాటు బోనస్, రైతుబంధు కింద రైతులకు ఆర్థిక సాయం పెంపు, వార్షిక జాబ్ క్యాలెండర్, బాలికలకు ఎలక్ట్రిక్ బైక్లు వంటి హామీలను పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉంది.

ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ హామీల నుంచి ఐదు ప్రధాన హామీలను ఖరారు చేసేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. రైతులు, యువత, నిరుద్యోగులకు డిక్లరేషన్లలో భాగంగా ఇప్పటికే ఈ హామీల్లో కొన్నింటిని పార్టీ ప్రకటించింది. కర్ణాటకలో మాదిరిగానే నవంబర్-డిసెంబర్ లో జరగనున్న ఎన్నికలకు ముందే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మ‌వుతోంది. ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందిస్తామని చెప్పారు. ఈ మేరకు పార్టీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే కొందరు రాష్ట్ర నేతలతో చర్చలు జరిపిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కర్ణాటక ఫలితం తెలంగాణలో పునరావృతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Latest Videos

గత ఏడాది మే నెలలో రైతుల కోసం పార్టీ డిక్లరేషన్ విడుదల చేయగా, గత నెలలో యువత, నిరుద్యోగుల కోసం డిక్లరేషన్ విడుదల చేసింది. రాబోయే రోజుల్లో మరికొన్ని వర్గాలకు పార్టీ డిక్లరేషన్లు విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు యూత్ కాంగ్రెస్ సన్నద్ధం కావాలని రేవంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ కు పిలుపునిచ్చారు. పార్టీ గెలుపు కోసం పోరాడే యువనేతలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. 1,200 మంది విద్యార్థులు, యువత త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు. రైతుల భూములను లాక్కోవడానికి పోర్టల్ ను వాడుకుంటున్నారని ఆరోపించారు. భూకబ్జాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో, 2014లో బీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత‌, మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ ను స్వీక‌రిస్తున్న‌ట్టు కూడా రేవంత్ రెడ్డి తెలిపారు.

click me!