
సీనియర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కుటుంబ సభ్యులను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే పరామర్శించారు. గురువారం ప్రీతి నివాసానికి చేరుకున్న ఆయన.. ప్రీతి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు.
ఇదిలావుండగా.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అనస్థీషియ విభాగంలో పీజీ మొదటి సంవత్సరంలో చేరిన ప్రీతి.. సీనియర్ విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈనెల 22న ఉదయం ఓ మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని మొదట కథనాలు వెలువడ్డాయి. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ఆమెని ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు.
Also REad: మెడికో ప్రీతిది హత్యే: విచారణ తీరుపై సోదరుడు వంశీ అనుమానాలు
అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో.. అదే రోజు హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి అక్కడి నుంచి తరలించారు. అప్పటినుంచి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స జరిగింది. కానీ ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆమెను కాపాడేందుకు ఐదుగురు వైద్యుల ప్రత్యేక బృందం విశ్వప్రయత్నాలు చేసింది. ఇంజక్షన్ ప్రభావం వల్ల ఆమె శరీరం లోపలి అవయవాలు అన్ని దెబ్బతిన్నాయని.. దీనివల్ల చికిత్సకు శరీరం ఏమాత్రం స్పందించలేకపోతుందని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి ప్రాణాలు కోల్పోయింది.
ఇకపోతే.. ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా నిందితుడు సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు చేసిన విజ్ఞప్తికి నిన్న వరంగల్ కోర్ట్ సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సైఫ్‌ను కస్టడీకి అనుమతించింది కోర్ట్. దీంతో గురువారం అతనిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు మెట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో అతనిని ప్రశ్నించనున్నారు.