మహిళా రిజర్వేషన్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని భారత జాగృతి సమితి చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ విషయమై ఢిల్లీలో ఆందోళన చేస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు.
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
గురువారం నాడు తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు.2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ పై బిజెపి చేర్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఈ హమీని అమలు చేయలేదని ఆమె విమర్శించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తిని చేసినట్టుగా చెప్పారు. ఇవాళ దేశంలో కూడా అదే పని చేయాలన్న ఉద్దేశంతో భారత్ జాగృతిగా రూపాంతరం చెందిందన్నారు.మహిళలు రాజకీయ రంగంలో రాణించాలంటే రిజర్వేషన్ తోనే సాధ్యమవుతుందని భారత్ జాగృతి విశ్వసిస్తుందన్నారు.
20 ఏళ్ల క్రితం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన దేశాలు 2026 నాటికి లింగ సమానత్వ లక్ష్యాలను చేరుకుంటాయని తెలిపారు. కానీ రిజర్వేషన్ కల్పించని భారత్ వంటి దేశాలు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2063 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని ఆమె తెలిపారు.
ఈ నిరాహార దీక్షకు అన్ని మహిళా సంఘాల ప్రతినిధులను, రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించామని తెలిపారు. గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం కనీసం జనగణన కూడా చేయలేదని ఆమె విమర్శించారు. జనగణనతో పాటు, ఓబీసీ జనగణన సైతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి వారి జనాభా ప్రకారం రాజ్యాంగబద్దంగా ఉపకోటా ఉండాలన్నారు.
1992 లో 72 వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. 1993 లో 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు పట్టణ స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
also read:జేపీ నేతలు చెప్పినట్టు అరెస్టులా? ఢిల్లీ లిక్కర్ స్కాంపై కవిత
ప్రస్తుతం 21 రాష్ట్రాలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఇప్పటికీ 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టుగా కవిత గుర్తు చేశారు. ఈ నెల10 న జంతర్ మంతర్ లో నిర్వహించే ధర్నాకు అన్ని రాష్ట్రాల నుండి వివిధ మహిళా సంఘాల నేతలు, రాజకీయ నేతలు పాల్గొననున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంటులో ఆమోదించగలిగిన బీజేపీ ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.