తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే డిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కూడా రేవంత్ కలవనున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మొదటిసారి దేశ రాజధాని డిల్లీ వెళుతున్నారు. ఇవాళ(మంగళవారం) ప్రత్యేక విమానంలో ఆయన డిల్లీకి పయనం అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను... తెలంగాణ పిసిసి చీఫ్ గా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలను రేవంత్ కలవనున్నారు. అందరినీ కలిసిన తర్వాత ఇవాళ సాయంత్రమే ఆయన తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
తెలంగాణకు రావాల్సిన నిధులతో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఇందుకోసం ఆయన ప్రధాని అపాయింట్ మెంట్ కోరారు. అలాగే మరికొందరు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పెద్దలకు కూడా రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలను కూడా రేవంత్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అలాగే లోక్ సభ ఎన్నికలతో మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు, నామినేటెడ్ పదవులపై కూడా కాంగ్రెస్ అదిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు.
Also read లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ ... సీఎం రేవంత్ సహా మంత్రులందరికి కీలక బాధ్యతలు
ఇప్పటికే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీచేయాలని తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఈ క్రమంలో రేవంత్ కూడా సోనియా గాంధీని కలిసి ఇదే కోరనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇందిరాగాంధీ మాదిరిగానే సోనియాను కూడా తెలంగాణ నుండి పోటీలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆమె పోటీచేస్తే ఆ ప్రభావం తెలంగాణలోని అన్ని లోక్ సభ నియోజకవర్గాలపై వుంటుందని...ఇది కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ నాయకులు భావిస్తున్నారు.
ఇక రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే లతో కూడా రేవంత్ భేటి కానున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన ప్రచారంపై వీరితో రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో ప్రచారం చేపట్టాల్సిందిగా వారిని రేవంత్ రెడ్డి కోరనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఇప్పటికే తెలంగాణ కేబినెట్ ఏర్పాటు జరిగినా మరికొందరిని మంత్రివర్గంలో తీసుకునేందుకు అవకాశం వుంది. దీంతో మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనలో రేవంత్ వున్నారట... ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని కీలక మంత్రిత్వ శాఖలు తనవద్దే వుండగా వాటిని ఎవరికి కేటాయించాలన్నదానిపై కూడా అదిష్టానంతో రేవంత్ చర్చించనున్నారని సమాచారం.
ఇదిలావుంటే లోక్ సభ ఎన్నికలకు ముందే స్థానికసంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఈసీ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ ఎన్నికల కంటే ముందే నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టి కాంగ్రెస్ లో మరింత జోష్ నింపాలని రేవంత్ భావిస్తున్నారు. దీనిపై కూడా కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది.