త్వరలోనే తెలంగాణలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడనుందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసని అనసూయ సొంత నియోజకవర్గం ములుగులో ప్రకటించారు.
ములుగు : ఇటీవల అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమవుతోంది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీల వివరాలను సేకరిస్తోంది. ఈ క్రమంలోనే స్త్రీ శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క (ధనసరి అనసూయ) నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల అగ్వన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు సీతక్క ప్రకటించారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి సొంత నియోజకవర్గం ములుగులో పర్యటించారు సీతక్క. ఈ క్రమంలోనే రూ.1.35 కోట్లతో ములుగు సఖీ కేంద్ర ఆవరణలో నిర్మించనున్న బాలసదనం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీల్లో ఖాళీలపై స్పందించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా అంగన్వాడీల్లో సరైన సిబ్బంది లేరన్నారు. ఇక ఇటీవల 4 వేల మినీ అంగన్వాడీలను కూడా అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. కాబట్టి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయి సిబ్బంది వుండేలా చర్యలు తీసుకుంటున్నామని... త్వరలోనే 14 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.
Also Read లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ ... సీఎం రేవంత్ సహా మంత్రులందరికి కీలక బాధ్యతలు
ఇదిలావుంటే మంత్రిగా మొదటిసారి సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన సీతక్కను ఘనస్వాగతం లభించింది. అనుచరులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీతక్కకు భారీ గజమాలతో సత్కరించారు. ర్యాలీగా ములుగులోని గట్టమ్మతల్లి దేవాలయానికి వెళ్లిన మంత్రి ప్రత్యేకపూజలు చేసారు. అక్కడినుండి నేరుగా మేడారం వెళ్లిన సీతక్క సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం త్వరలో జరగనున్న మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే మేడారం జాతరకోసం ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు కేటాయించిందని ... అవసరం అయితే మరిన్ని నిధులు కూడా అందిస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేసారు. రాజకీయం స్వార్థంతోనే కొందరు మేడారం జాతరకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయించిందిని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇలవేల్పులు సమ్మక్క సారలమ్మల జాతరను కాంగ్రెస్ ప్రభుత్వం వైభవంగా నిర్వహించేందుకు సిద్దంగా వుందన్నారు.