రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నిజామాబాద్ సీరియల్ కిల్లర్ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఇప్పుడు మృతుడి తల్లి కూడా కనిపించడం లేదు.
నిజామాబాద్ : నిజామాబాద్ సీరియల్ కిల్లర్ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ప్రసాద్ తల్లి సుశీల కూడా కనిపించడం లేదంటున్నారు బంధువులు. సుశీలను కూడా ప్రశాంతే చంపేశాడా? లేక ఎక్కడైనా దాచి పెట్టాడా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిజామాబాద్ సీరియల్ కిల్లర్ చంపింది ఆరుగురినా? లేక ఏడుగురినా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చంపేసిన వారిలో ఇద్దరు మృతదేహాలు ఇప్పటివరకు లభ్యం కాలేదు. ఇప్పుడు తల్లి కూడా కనిపించడం లేదని వెలుగు చూడడంతో తీవ్ర కలకలంగా మారింది.
ఇదిలా ఉండగా, సోమవారం నాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య ఘటన సంచలనంగా మారింది. తొమ్మిది రోజుల వ్యవధిలో ఓ వ్యక్తి ఈ దారుణ హత్యలు చేశాడు. తొమ్మిది రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హతమార్చిన నిందితుడు ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో దారుణమై విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మృతుడు ప్రసాద్, నిందితుడు ప్రశాంత్ ప్రాణ స్నేహితులు...ఆస్తి వివాదాల కారణంగా.. ప్రాణ స్నేహితుడు అని కూడా చూడకుండా ఒక్కొక్కరిగా కుటుంబం మొత్తాన్ని అంతమొందించాడు ప్రశాంత్. ఈ మేరకు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. డిసెంబర్ 9 నుండి వారం రోజుల వ్యవధిలో ప్రసాద్ కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశాడు.
భారత్ లో బయటపడ్డ కరోనా జేఎన్.1 కేసులు... తెలంగాణలో అలర్ట్
ప్రసాద్ భార్య రమణిని బాసర దగ్గర గోదావరిలో పడేసి హతమార్చాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరుకు చెందిన ప్రశాంత్, ప్రసాద్ లిద్దరికీ నేరచరిత్ర ఉంది. ఇదర్దిపై నేరారోపణలున్నాయి. అయితే, ప్రశాంత్ గ్రామం వదిలి వెళ్లి నిజామాబాద్ లో నివాసం ఉంటున్నాడు. ప్రసాద్ కూడా మాక్లూరు నుంచి వెళ్లిపోయి... తల్లి, ఇద్దరు చెల్లెళ్లు, భార్య, పిల్లలతో కలిసి కామారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. అప్పుల విషయంగా వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది.
ఈ క్రమంలో బ్యాంకు లోన్ కోసం ప్రసాద్ ప్రయత్నించాడు. ఇదే అదనుగా భావించిన ప్రశాంత్ ఇంటిని తన పేర రాస్తే లోన్ వచ్చేలా చేస్తానన్నాడు. ప్రసాద్ మాటలు నమ్మిన ప్రసాద్ అలాగే ప్రశాంత్ పేరుమీద ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తరువాత ప్రశాంత్ రోజులు గడుస్తున్నా లోను మాట ఎత్తలేదు. దీంతో మోసం జరిగిందని గ్రహించిన ప్రసాద్ తన ఇల్లు తన పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చాడు.
దీంతో ఇంటికోసం స్నేహితుడి కుటుంబాన్ని అంతమొందించాలనుకున్నాడు. అందుకే, ఈ నెల 9న ప్రసాద్ ను హత్య చేశాడు. డిచ్ పల్లి జాతీయ రహదారి పక్కన ప్రసాద్ మృతదేహన్ని పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్ ఇంటికెళ్లి పోలీసులు ప్రసాద్ ను అరెస్ట్ చేశారని నమ్మించి ప్రసాద్ భార్య రమణిని తీసుకెళ్లి గోదావరిలో తోసి, చంపేశాడు. ఆ తరువాత తల్లిదండ్రులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారని ప్రసాద్ ఇద్దరు కూతుళ్లను నమ్మించి, నిర్మల్ జిల్లా సమీపంలోని సోన్ బ్రిడ్జి దగ్గరికి తీసుకెళ్లి హతమార్చాడు. ఆ తరువాత ప్రసాద్ సోదరిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ దగ్గర హతమార్చాడు. సదాశివనగర్ లో ప్రసాద్ సోదరి మృతదేహం ఆధారంగా పోలీసులు విచారణ జరపడంతో ఈ ఆరుగురి హత్యలూ వెలుగు చూశాయి.
సదాశివనగర్ లో మహిళ హత్య కేసు విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ప్రసాద్ తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకు ప్రసాద్, కూతురు, కోడలు, కొడుకు పిల్లలు కనిపించడం లేదని తెలిపింది. వీరందరినీ ప్రశాంతే తీసుకెళ్లాడని చెప్పుకొచ్చింది. సదాశివనగర్ లో మహిళ హత్య కేసు విచారణలో.. పోలీసులకు ప్రశాంత్ ఫోన్ సిగ్నల్స్ అదే ప్రాంతంలో దొరికాయి. దీంతో అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ ఆరు హత్యల విషయం వెలుగు చూసింది. మొదటి మూడు హత్యలను ప్రశాంత్ ఒక్కడే చేశాడు. ఆ తరువాత మూడు హత్యలకు ప్రశాంత్ తో పాటు మరికొందరున్నారని పోలీసులు గుర్తించారు. వీరిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పుడు ప్రసాద్ తల్లి కూడా కనిపించకుండా పోయింది.