తెలంగాణలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.
తెలంగాణలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో నేడు నిర్వహించనున్న సమీక్షా సమావేశం అనంతరం దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ప్రభుత్వం అందించే రకరకాల పథకాలకు రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కార్డుల మంజూరుపై ఎలాంటి ముందడుగు పడలేదు. దీనిపై ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
కాగా.. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రభుత్వం వద్ద కూడా గుట్టల కొద్దీ దరఖాస్తులు పెండింగ్‌లో వున్నాయి. మార్పులు, చేర్పులు, కొత్తగా కాపురం పెట్టినవారు ఇలా రకరకాల కారణాలతో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం రాజధాని హైదరాబాద్‌లోనే రేషన్ కార్డుల కోసం దాదాపు 1.25 లక్షల దరఖాస్తులు అందాయట, ఇక రాష్ట్రం మొత్తం చూస్తే 90.14 లక్షల రేషన్ కార్డులు వున్నట్లుగా అంచనా.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలోనే దర్యాప్తునకు ఆదేశిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు నెల క్రితం మేడిగడ్డ బ్యారేజీలో స్తంభాలు కూలిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించనున్నట్లు మంత్రి తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ (ఐ అండ్ క్యాడ్) శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.
ALso Read: Uttam Kumar Reddy: "కాళేశ్వరంపై దర్యాప్తు చేపడుతాం.. బాధ్యులను వదిలి పెట్టబోం.."
పెండింగ్, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాజెక్టుల గురించి మంత్రికి ఈఎన్ సీ మురళీధర్ రావు వివరించారు. సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, కేబినెట్ సమావేశంలో లోపాలను కూలంకషంగా చర్చించి విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్) కింద 70 వేల ఎకరాలకు పైగా స్థిరీకరణ జరిగిందని అధికారులు ప్రజెంటేషన్ సందర్భంగా చెప్పడంతో మంత్రి ఆశ్చర్యపోయారు. మేడిగడ్డ బ్యారేజీ లోపాలకు బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని, నిర్మాణం, డిజైన్‌తో సంబంధం ఉన్న వారినే బాధ్యులని అన్నారు.