తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరిస్తారు. హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మించిన ఈ మహా విగ్రహాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేస్తారు. ముఖ్య అతిథిగా అంబేద్కర్ మునిమనవడు ప్రకాశ్ అంబేద్కర్ పాల్గొంటున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఈ రోజు అట్టహాసంగా జరగనుంది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన దేశంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. అంబేద్కర్ 132వ జయంతి నాడు ఆయన మహా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల సమున్నత జ్ఞాన శిఖరం, రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు యావత్ తెలంగాణ ఈ వేడుక పైనే దృష్టి పెట్టనుంది. ఇతర రాష్ట్రాల్లోనూ బాబా సాహెబ్ అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణపై ఆసక్తి నెలకొని ఉన్నది.
ఈ విగ్రహావిష్కరణకు పెద్ద సంఖ్యలో దేశం నలుమూలల నుంచి ఆహ్వానితులు హాజరు కానున్నారు. అంబేద్కర్ స్మృతి వనంలో సుమారు 40 వేల మంది కూర్చునేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన ఆహ్వానితులకు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందజేశారు.
బౌద్ధ సంప్రదాయంలో జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన ముని మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రకాశ్ అంబేద్కర్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. అలాగే, విగ్రహ రూపశిల్పి రామ్ వంజీ సుతార్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు.
కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి..
హుస్సేన్ సాగర్ సమీపంలోని అంబేద్కర్ మహా విగ్రహం వద్దకు సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటారు.
-అంబేద్కర్ విగ్రహంపై ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించి ఆయనకు ఘనంగా పుష్పాంజలి ఘటిస్తారు.
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆమె ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
-అనంతరం, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్‌లు ప్రసంగిస్తారు.
-అటు తర్వాత సీఎం కేసీఆర్ జయంతి వేడుకలను ఉద్దేశించి సందేశమిస్తారు.
-సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ధన్యవాద ప్రసంగం చేస్తారు.
-ఆయన ప్రసంగంతో సాయంత్రం 5 గంటలకు సభ ముగుస్తుంది.