
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదంటూ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ప్రకటనపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రం ఈ ప్రకటన చేసిందన్నారు. అదానీకి బైలడిల్లా గనులు కేటాయించిన విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిందని, దీని దృష్టిని మళ్లించేందుకే కేంద్రం స్పందించిందని కేటీఆర్ ఆరోపించారు.
చిత్తశుద్ధి వుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపివేసే వరకు పోరాటం ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే వరకు కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఒక్క మాట మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు మధ్యాహ్నం కేటీఆర్ మాట్లాడుతూ.. తమ వల్లే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందన్నారు. తమతో పెట్టుకుంటే అట్లుంటదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో గట్టిగా మాట్లాడింది ఒక్క కేసీఆర్ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందున్నారు. తాము తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం ఒక ప్రకటన చేసిందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దెబ్బంటే అలా వుంటుందని మంత్రి అన్నారు.
కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ చెప్పారు. గురువారంనాడు ఫగ్గన్ సింగ్ విశాఖపట్టణం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఈ విషయమై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. ఈఓఐలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఎత్తుగడగా కేంద్ర మంత్రి మంత్రి అభిప్రాయపడ్డారు.