
రాబోయే వారం రోజుల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలుకు సంబంధించి జీవో జారీ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ ప్రసంగిస్తూ.. మావా నాటే మావా రాజే.. మా తండాలో మా రాజ్యం అనే నినాదాన్ని నిజం చేశామని సీఎం తెలిపారు. మోడీ మా జీవోను గౌరవిస్తావా..? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటావా అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని అడిగి అడిగీ విసిగిపోయామని, మా రిజర్వేషన్ సంగతి మేమే చూసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీ, బంజారా భవన్‌లను ప్రారంభించడం సంతోషంగా వుందన్నారు సీఎం కేసీఆర్. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం రెండు భవన్‌లు వేదికలు కావాలని ఆకాంక్సించారు. సమస్యల పరిష్కారం కోసం శాస్త్రీయంగా, సరైన పంథాలో చర్చలు జరగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఏపీలో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్లే వర్తించాయని సీఎం గుర్తుచేశారు. రిజర్వేషన్లు పది శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఏడేళ్ల కిందటేప కేంద్రానికి పంపామని కేసీఆర్ తెలిపారు. ఆ బిల్లును ఎందుకు ఆపుతున్నారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. మోడీ పుట్టినరోజున చేతులు జోడించి అడుగుతున్నానని.. ఆ బిల్లుకు రాష్ట్రపతితో ఆమోదముద్ర వేయించాలని కేసీఆర్ కోరారు.
మా న్యాయమైన హక్కునే తాము అడుగుతున్నామని.. పోడు రైతులకు ఇచ్చేందుకు భూములు గుర్తించామని ముఖ్యమంత్రి తెలిపారు. పోడు భూములు రైతులకు ఇచ్చి వారికి కూడా రైతు బంధును అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు వెంటనే పెంచాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తోందన్నారు. దేశ సంపదనంతా మోడీ ధనవంతులకే దోచిపెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. రిజర్వేషన్ పెంచడానికి కేంద్రానికి ఏం అడ్డం వచ్చిందో మోడీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో ఇచ్చిన రిజర్వేషన్.. మాకెందుకు ఇవ్వరు అని సీఎం ప్రశ్నించారు. జాతీయ పార్టీ పెట్టాలని మహారాష్ట్ర నుంచి కొంతమంది వచ్చి తనకు మద్ధతు తెలిపారని కేసీఆర్ వెల్లడించారు. రూ.300 కోట్లు మంజూరు చేసి త్రీ ఫేజ్ కరెంట్ అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో గిరిజన గురుకులాల సంఖ్యను ఇంకా పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. సంపద పెంచడం, అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతమన్నారు. దళిత బంధులాగే గిరిజన బంధు కూడా ప్రారంభిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.