ఎస్పీనా? టీఆర్ఎస్ కార్యకర్తనా? జయహో మంత్రి జగదీశ్ రెడ్డి నినాదాలపై విమర్శలు

By Mahesh KFirst Published Sep 17, 2022, 3:33 PM IST
Highlights

సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేటలో జరిగిన ఓ సభకు హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆయన ప్రశంసలు కురిపించారు. సభకు హాజరైన వేల మందితోనూ ఆయన మంత్రికి జై కొట్టించారు.

హైదరాబాద్: సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి తన పరిధిని దాటి, స్థాయిని మరిచి ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలా బిహేవ్ చేయడం ఏంటని ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఏకంగా ఓ మంత్రికి జయహో అని నినాదాలు ఇవ్వడం, ప్రజలతోనూ నినదించేలా చేయడంపై తీవ్ర ఆక్షేపణలు వస్తున్నాయి.

జాతీయ సమైక్యతా వజ్రోత్సవంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన సభకు మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభలోనే జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ శృతిమించి వ్యవహరించారు. ‘జయహో మంత్రి జగదీశ్ రెడ్డి గారికి.. మన ముందు తరానికి ఆయన ఓ గురువు.. ఆయన మంత్రిగా సేవలు అందించడం మన అందరి అదృష్టం’ అని ఆయన స్వయంగా వ్యాఖ్యానించారు. అంతటితో ఆగలేదు.. ఆ సభకు హాజరైన సుమారు పది వేల మందితోనూ మంత్రి జగదీశ్ రెడ్డికి జై కొట్టించారు. దీంతో ఐపీఎస్ అధికారి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా ప్రవర్తించడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అదే వేదికపై ఉన్న మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం ఎస్పీ వ్యాఖ్యలపై ఏమనలేదు.

మంత్రి అనారోగ్యంగా ఉన్నప్పటికీ మన కోసం ఈ మీటింగ్‌కు వచ్చాడని ఆయనను ఎస్పీ ఆకాశానికి ఎత్తారు. అందరూ పూర్వీకులు నేర్పిన నైతిక విలువలతో పురోగతి సాధించాలని, ముందడుగు వేస్తే.. భవిష్యత్‌లో మంచి ఉద్యోగాలు సాధిస్తే మంత్రి జగదీశ్ రెడ్డి హర్షిస్తారని చెప్పుకొచ్చారు. 

సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పోలీసు శాఖలో కింది స్థాయి నుంచి జిల్లా ఇంచార్జీగా ఎదిగారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అరుదుగా లభించే అవకాశాన్ని వినియోగించుకుని ఆయన ఈ ఉన్నత స్థాయికి ఎదిగారు. సుమారు సంవత్సరా కాలం రైల్వేలో అదనపు ఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత ప్రమోషన్‌ పై డీజీపీ కార్యాలయానికి రావడం గమనార్హం. గతేడాదే ఆయన సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు.

click me!