
ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. లేడిస్ హాస్టళ్లు మూసేయొద్దని కోరారు. సెమిస్టర్, దసరాల సెలవులు రావడంతో హాస్టల్ చీఫ్ వార్డెన్ మూసేస్తున్నామని అన్నారు. అయితే హాస్టళ్లు మూసేస్తే తాము ఎక్కడ ఉండాలని పలువురు విద్యార్థినిలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకు దిగిన విద్యార్థులు.. యూనివర్సిటీ వీసీ వచ్చి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేడీస్ హాస్టల్ ముందు రోడ్డు మీద బైఠాయించారు. దీంతో పోలీసులు ఓయూ గేట్లు మూసేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల కూడా ఓయూ విద్యార్థినులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. హాస్టల్‌లో ఫుడ్ సరిగా పెట్టడం లేదని వారు నిరసనకు దిగారు. ‘‘గత రెండు వారాల నుంచి ఫుడ్ సరిగా ఉండడం లేదు. అన్నం గడ్డలు గడ్డలుగా అవుతుంది. నీళ్ల నీళ్ల సాంబారు.. రిపీటెడ్ కర్రీలు. టిఫిన్స్‌లో చట్నీలు అస్సలు బాలేవు. లిమిటెడ్ భోజనం పెడుతున్నారు. నోటిఫికేషన్లు పడటంతో ఎంతో మంది మంచి మంచి జాబ్‌లు రావాలని ప్రిపేర్ అవుతున్నారు. కొంచెం ఫుడ్ ఎక్కువ పెట్టమంటే పెట్టడం లేదు. మీరు అంత తింటారా? ఇంత తింటారా? అని మాట్లాడుతున్నారు. మెస్ బిల్లు కట్టినప్పుడు ఎంత అడిగితే అంత ఫుడ్ పెట్టాలి. లిమిటెడ్ ఫుడ్ ఏమిటి?. అమ్మాయిలు చాలా బలంగా ఉండాలి. అబ్బాయిల కంటే అమ్మాయిలే బలంగా ఉండాలి అని పేరుకే కొటేషన్స్ చెప్తారు.
పేరుకే ఇలాంటి మాటలు మాట్లాడతారా?.. ఎంత ఫుడ్ పెట్టాలో కూడా తెలియదా?. మేము గాజు పెంకులొచ్చిన ఫుడ్ తిన్నాం. మాకేమైనా అయితే అధికారులే బాధ్యత వహించాలి. అది సీఎం అయినా, వీసీ అయినా సరే.. ఎవరనేది నాకు అవసరం లేదు. పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని మమ్మల్ని ఇక్కడికి పంపిస్తే.. ఇలాంటి ఫుడ్ తినాలా?. మా భోజనంలో గాజు పెంకులొచ్చాయి.. కొంత ఫుడ్ తిన్నాక కనిపించాయి. అంతకుముందే అవి లోపలికి వెళ్లుంటే మీరే బాధ్యులు’’ అని ఓ విద్యార్థిని చెప్పారు.