ఇటు నుంచి అటు మారితే.. అన్ని మర్చిపోతారా : ఈటల టార్గెట్‌గా అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 12, 2023, 5:36 PM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సెటర్లు వేశారు. ఇక్కడి నుంచి అక్కడికి పోతే అన్నీ మర్చిపోతారా అని సీఎం ప్రశ్నించారు. తమకు భేషజాలు లేవని, మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

బీజేపీలో చేరిన తన ఒకప్పటి సహచరుడు ఈటల రాజేందర్ టార్గెట్‌గా అసెంబ్లీలో కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదే పదే ఆయన పేరునే ప్రస్తావించారు సీఎం. మా రాజేందరన్న సందు దొరికితే బద్నాం చేయాలనే ఆలోచనలో వున్నారని కేసీఆర్ అన్నారు. ఎస్సారెస్పీ నుంచి మహారాష్ట్రకు నీళ్లు ఇస్తానన్నావ్ అని అడుగుతున్నాడని ఫైర్ అయ్యారు. ఈటల ఈ సైడ్ నుంచి ఆ సైడ్‌కు మారొచ్చు అయనకు ఇవన్నీ తెలీదా అంటూ కేసీఆర్ చురకలంటించారు. ఈటలకు కూడా అన్ని విషయాలు తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి పోతే అన్నీ మర్చిపోతారా అని సీఎం ప్రశ్నించారు. డైట్ ఛార్జీలు పెంచాలని ఈటల కోరారని.. అది న్యాయ సమ్మతమైన కోరికనన్న ఆయన రెండు మూడు రోజుల్లో జీవో విడుదల చేస్తామన్నారు. కావాలంటే ఈటలను కూడా పిలుపుకోని.. ఆయన సలహా కూడా తీసుకోవాలని కేసీఆర్ సెటైర్లు వేశారు. తమకు భేషజాలు లేవని, మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈటల అడిగారని చేయకుండా వుండొద్దని మంత్రులను ఆయన ఆదేశించారు. 

ఇవాళ దేశానికి వున్న లక్ష్యం ఏంటని సీఎం ప్రశ్నించారు. ఏం చేసైనా సరే ఎన్నికల్లో గెలవడమే పని అని.. దేశంలో నీటి యుద్ధాలు ఎందుకని కేసీఆర్ నిలదీశారు. ఇలా అయితే దేశం ఎటువైపు పోతుంది.. కిసాన్ సర్కార్ వస్తే తప్ప దేశం బాగుపడదని సీఎం అన్నారు. అందుకే అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అని పెట్టామని ఆయన తెలిపారు. వడ్లు కొనమని అడిగితే నూకలు తినమంటారా , ఇంత అహంకారమా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లాంటి ప్రభుత్వం వస్తే దేశం బాగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. చూసి చూసి విసుగొచ్చి రిటైర్మెంట్ సమయంలో ఈ దిక్కుమాలిన పెంట పెట్టుకున్నానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశం ఇలా నాశనం అవుతుంటే చూడబుద్ధి అవ్వట్లేదని సీఎం అన్నారు. ఈ విశ్వగురులు వద్దని.. దేశ గురువు వుంటే చాలని కేసీఆర్ సెటైర్లు వేశారు. 

Latest Videos

Also Read: కూలుస్తుంటే చూస్తూ ఊరుకుంటామా : బండి సంజయ్ , రేవంత్ రెడ్డిలకు కేసీఆర్ వార్నింగ్

ఈ దేశంలో వున్న ఇరిగేషన్ పాలసీని గంగలో పడేసి కొత్త పాలసీ తెస్తామని ఆయన స్పష్టం చేశారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని చెప్పిది చేసి చూపిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. 24 గంటలు కరెంట్ కావాలని అక్కడ ఎవరో ధర్నా చేశారని ఆయన ఫైర్ అయ్యారు. నీకు నెత్తా..? కత్తా..? గ్రిడ్ లోడ్ బ్యాలెన్స్ లేకుంటే కరెంట్ కట్ చేస్తారని కేసీఆర్ చురకలంటించారు. నిమిషం కూడా కరెంట్ పోదు, పోనివ్వమని ఆయన స్పష్టం చేశారు. ఎంత ఖర్చయినా కరెంట్ పోనివ్వమని.. 16 వేల మెగావాట్ల లోడ్‌కు చేరినా కరెంట్ పోదని కేసీఆర్ స్పష్టం చేశారు. బొగ్గు పుష్కలంగా వున్నా కరెంట్ రాదని.. చంద్రబాబు ఇంకుడు గుంతలన్నారని, వైఎస్ బొంకుడు గుంతలన్నారని సెటైర్లు వేశారు. అంబేద్కర్ ప్రతిష్ట చిరస్థాయిలో వుండేలా సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు. పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని సూచించామని సీఎం వెల్లడించారు. 

click me!