ఏకాణాకు పనికిరాని వాళ్లు ధర్నాలు చేస్తున్నారు: విపక్షాలకు కేసీఆర్ చురకలు

By Siva KodatiFirst Published Jun 20, 2021, 8:06 PM IST
Highlights

కామారెడ్డి పట్టణానికి అద్భుతమైన భవిష్యత్ ఉందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదివారం కామారెడ్డిలో సమీకృత కలెక్టరేట్ భవనాల సముదాయలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డికి వచ్చే ఏడాది మెడికల్ కాలేజీ వస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కామారెడ్డి మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు

కామారెడ్డి పట్టణానికి అద్భుతమైన భవిష్యత్ ఉందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదివారం కామారెడ్డిలో సమీకృత కలెక్టరేట్ భవనాల సముదాయలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డికి వచ్చే ఏడాది మెడికల్ కాలేజీ వస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కామారెడ్డి మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

కామారెడ్డి జిల్లాలోని గ్రామాలన్నింటికీ రూ.10 లక్షల చొప్పున ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు ప్రకటించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం నీరందిస్తామని సీఎం స్పష్టం చేశారు. చెప్పిన పనిని నిబద్ధతతో ఆచరించామని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణలో ఇక ముందు కూడా కరెంట్ కొరత ఉండదని.. దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని సీఎం వెల్లడించారు.

ఎవరూ చెప్పకుండానే ఎన్నో పథకాలకు రూపకల్పన చేశామని..ఏకాణాకు పనికిరాని వాళ్లు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. అలాంటి వాళ్లకు సిగ్గుండాలంటూ సీఎం చురకలంటించారు. కరెంట్ ఉత్పత్తిలో పక్క రాష్ట్రాలకు సప్లై చేసే స్థాయికి వెళ్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏకే గోయల్ సూచనల మేరకు పెన్షన్‌ను తొలి విడతలో వెయ్యి రూపాయలు చేశామని గుర్తుచేశారు.

Also Read:బంగారు తెలంగాణ వచ్చి తీరుతుంది: కేసీఆర్

అనంతరం మళ్లీ చర్చించి పెన్షన్‌ను రూ.2000 చేశామన్నారు. దేశంలో ఒంటరి మహిళలకు ఏ రాష్ట్రంలోనైనా పెన్షన్ ఇస్తున్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలోనైనా పెన్షన్ ఇస్తున్నారా అని సీఎం వ్యాఖ్యానించారు. పాలనా సంస్కరణల్లో భాగంగా 33 జిల్లాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. సిద్ధిపేట, కామారెడ్డి మాదిరిగానే అన్ని జిల్లాల్లో సమీకృత భవనాలను నిర్మించామని సీఎం తెలిపారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి నాందేడ్‌లోని 40 గ్రామాలు తమను తెలంగాణలో కలపాలని తీర్మానం చేశాయని కేసీఆర్ అన్నారు.

రెవెన్యూ సంస్కరణల్లో భాగంగానే ధరణి పోర్టల్ తీసుకొచ్చామని కేసీఆర్ తెలిపారు. నేరం చేసినవారు తప్పించుకోని విధంగా పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం అన్నారు. తప్పు చేసే అధికారం తనకు లేదని.. తప్పు చేస్తే కొన్ని తరాలను దెబ్బ కొడుతుందని కేసీఆర్ అన్నారు. ప్రజా ప్రతినిధులు అతి జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం సూచించారు. రైతు బంధుకు రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.15000 ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. 

click me!