ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ : బెజవాడలో కార్యాలయ నిర్మాణం... శంకుస్థాపనకు కేసీఆర్

By Siva KodatiFirst Published Dec 10, 2022, 7:54 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోనూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను విస్తరించాలని కేసీఆర్ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. విజయవాడలో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారు. 

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానంటూ రంగంలోకి దిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఈసీ అధికారికంగా ఆమోదముద్ర వేసిన తర్వాత శుక్రవారం బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. 

తెలంగాణకు పొరుగున వున్న ఆంధ్రప్రదేశ్‌పై తొలుత దృష్టిపెట్టారు గులాబీ దళపతి. విజయవాడలో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారు. జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవేపై 800 గజాల్లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఇందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18, 19 తేదీల్లో స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించనున్నార. జనవరి చివరి నాటికి ఏపీ రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీలను వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం శంకుస్థాపనకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం వుంది.

ALso REad:ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరాలి: పార్టీ నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

ఇకపోతే... టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ మారుస్తూ ఈసీ పంపిన  పత్రాలపై శుక్రవారంనాడు మధ్యాహ్నం కేసీఆర్ సంతకం చేశారు. అనంతరం పార్టీ నేతలతో కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాల్సింది గులాబీ జెండానేనని కేసీఆర్ చెప్పారు. కర్ణాటకకు కుమారస్వామి సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పరివర్తన కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలని ... నాలుగైదు నెలల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టుగా కేసీఆర్ తెలిపారు. 

త్వరలోనే పార్టీ పాలసీలను రూపొందిస్తామని కేసీఆర్ చెప్పారు. కర్ణాటకలో  జేడీఎస్ కు బీఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు. రైతు పాలసీ, జలవిధానాన్ని రూపొందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అబ్‌కీ బార్  కిసాన్ సర్కార్ ఇదే బీఆర్ఎస్ నినాదమని కేసీఆర్ వివరించారు. తన ప్రతి ప్రస్థానంలో అవహేళనలు ఉన్నాయని వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. అన్ని ప్రతికూల పరిస్థితులను అదిగమించి తెలంగాణను సాధించుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తెలుగువాళ్లున్నారన్నారు. 

click me!